- నెలాఖరులోగా ధరణి పెండింగ్ అప్లికేషన్స్ పూర్తి
రేగోడ్, వెలుగు: కోర్టు పరిధిలోకి వచ్చే రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కుటుంబ ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న భూ సమస్యలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగితే పరిష్కారం కావన్నారు. అలాంటి వాటిని కోర్టు తీర్పు అనంతరమే తాము పరిష్కరించగలుగుతామన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కలెక్టర్ పలు ఆఫీసులను తనిఖీ చేశారు. రేగోడు తహసీల్దార్ ఆఫీసులో భూ రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ధరణి అప్లికేషన్స్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు.
ఎక్కువ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ధరణిలో మార్పులు తీసుకువచ్చిందని, మేజర్ ఇష్యూస్ ఉంటే ఆర్డీవో ద్వారా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించి స్టూడెంట్స్తో మాట్లాడారు. స్టోర్ రూమ్, వంటశాలను పరిశీలించారు. హాస్టల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్వో స్వయంప్రభకు సూచించారు.
అనంతరం పీహెచ్సీని సందర్శించి డాక్టర్ల హాజరు పట్టికను పరిశీలించారు. పేషంట్లతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలోని మందులను చెక్చేశారు. ఆసుపత్రికి 108 కేటాయించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడతానన్నారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్కు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు.
విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మెదక్ టౌన్: ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టర్ ఆఫీసులో జిల్లా అధికారులతో పథకం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి పట్టణాలు, మండలాల్లో స్వయం సహాయక బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్పర్సన్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మంగలి, చాకలి, వడ్డెర, అవుసలి, కంసాలి ఇలా 18 కులవృత్తుల వారు ఈ పథకానికి అర్హులవుతారన్నారు. ఈ పథకం కింద పనిముట్లకు రూ.15 వేలు అందించడంతో పాటు గుర్తింపు కార్డు, ధ్రువీకరణ పత్రం అందజేస్తామని వివరించారు.