దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ : రాహుల్ రాజ్

మెదక్​టౌన్, వెలుగు: దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. బుధవారం మెదక్​కలెక్టర్ ఆఫీసులో భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతిని షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. అడిషనల్​కలెక్టర్​రమేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, సంబంధిత అధికారులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ 1906లో షెడ్యూల్డ్​ కులాల బాలబాలికలకు విద్యను అందించడం కోసం హైదరాబాద్​లోని ఈసామియా బజారులో జగన్​మిత్ర మండలిని స్థాపించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి

జిల్లా వ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. మెదక్​ పట్టణంలోని దాయర వద్ద ఏర్పాటు చేసిన పీఏసీఎస్​ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించేవిధంగా అధికారులు  అవగాహన కల్పించాలన్నారు. జూన్ మొదటి వారంలోగా కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.