ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

  • వినతులు స్వీకరించిన కలెక్టర్లు

మెదక్​టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​కలెక్టర్​ఆఫీసులో కలెక్టర్, అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని రాందాస్​ చౌరస్తా నుంచి చెమన్​ నుంచి దాయర వరకు రూ.7.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణం నాణ్యత లోపంతో చేపడుతున్నారని దాయర వాసులు కలెక్టర్​ కు ఫిర్యాదు చేశారు.

రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, ఇసుకకు బదులు పూర్తిగా డస్ట్​వినియోగిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ ఇష్టారీతిగా పనులు చేస్తున్నా ఆర్​ అండ్​ బీ అధికారులు పర్యవేక్షించకపోగా తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంట్రాక్టర్​, ఆర్​ అండ్​ బీ అధికారులపై చర్యలు తీసుకుని రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని కోరారు. కలెక్టర్​ను కలిసిన వారిలో  రవికుమార్, చంద్రశేఖర్​ గౌడ్​, శేఖర్​, రమేశ్​ఉన్నారు.​  ​ 

కారుణ్య నియామకాలు చేపట్టాలి

సంగారెడ్డి టౌన్ : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 81 ,85 ప్రకారం 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏల వారసుల నియామకాలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతికి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో గ్రీవెన్స్ లో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3797 మంది వీఆర్ఏ వారసుల నియామకాలు చేపట్టాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలో  అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్​లో ఇండోర్ స్టేడియం తో పాటు 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, అన్ని క్రీడాంశాలకు సంబంధించిన కోచ్​లను నియమించడంతో పాటు  ప్రాంతీయ క్రీడా అకాడమీ ఏర్పాటు చేయించి వసతులు కల్పించాలని

మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మానయ్య కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ప్రైవేట్ స్కూల్​ఫీజుల దోపిడీని నియంత్రిస్తూ చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్ లో మొత్తం 79 దరఖాస్తులు రాగా రెవెన్యూకి సంబంధించి 33, ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​తెలిపారు. 

సిద్దిపేట టౌన్ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​కలెక్టర్లు గరిమా అగర్వాల్​, శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 31 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో డబుల్​బెడ్​రూం, పింఛన్లు, ధరణి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగ రాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.