యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ మను చౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: డ్రగ్స్​నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. కలెక్టరేట్​లో బుధవారం ఆయన అధ్యక్షతన డ్రగ్స్ నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 28 గంజాయి కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బీహార్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల ద్వారా గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి లేబర్లకు ఇస్తున్నారని వివరించారు. సిద్దిపేట పట్టణంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ పెయిన్ కిల్లర్ లో డ్రగ్స్ మిక్స్ చేసి పేషెంట్లను ఇస్తున్నట్టు అనుమానంగా ఉందన్నారు. 

డ్రగ్స్ నిర్మూలనలో  సంబంధిత శాఖల సపోర్ట్ అవసరమని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో వెంటనే యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, అటవీశాఖ అధికారులు గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎఫ్​వో శ్రీనివాస్, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, సిద్దిపేట ఏసీపీ మధు, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఏవో మహేశ్, డ్రగ్ ఇన్స్ పెక్టర్ వినయ సుష్మి పాల్గొన్నారు.