కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి కనీస మద్దతు ధర పొందాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్ మండలం సీతారాంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి ప్రారంభించారు. 

ప్రభుత్వం సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. రైతుల వివరాలు ట్యాబ్​లో నమోదు చేసి 48 గంటల్లోగా నగదు రైతు ఖాతాలో జమవుతుందన్నారు. అనంతరం తీగల్ పహాడ్ జడ్పీ హై స్కూల్​ను సందర్శించి క్లాస్ రూమ్ లను పరిశీలించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీచర్లకు సూచించారు.