నస్పూర్, వెలుగు : ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ తెలుసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ సీపీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులకు సీపీఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఎంతో మంది గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోతున్నారని
ఈ మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ప్రక్రియ తెలుసుకొని ఉండాలన్నారు. సీపీఆర్లో ఛాతి దగ్గర నొక్కడం, రెస్క్యూశ్వాసలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వడంతో శరీరమంతా ఆక్సిజర్ తో కూడిన రక్తప్రసారం జరిగి గుండె సాధారణ స్థితికి వస్తుందని, ప్రాణాపాయం నుంచి 50 శాతం వరకు బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన శిబిరం నిర్వహిస్తామని..
స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కార్యకర్తలకు సీపీఆర్ పై అవగాహన కల్పించేలా కార్యచరణ రూపొందించాలని, ఆర్టీసీ అఫీసర్లకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ నాయక్, ప్రోగ్రామ్ అధికారి కృపామయి, జిల్లా సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, సీడీపీవోలు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.