రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు: కలెక్టర్

మంచిర్యాల, వెలుగు: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎం- కన్వెన్షన్ హాల్​లో లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్​ డొనేషన్​ క్యాంప్​లో చీఫ్​గెస్ట్​గా పాల్గొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్​ అనిత, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి క్యాంప్​ను ప్రారంభించారు. రక్తదానం చేయడం ద్వారా శరీరంలో నూతన రక్తం పెంపొంది మరింత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం మరింత మందికి స్ఫూర్తిదాయకమన్నారు. రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని 75 యూనిట్లు అందించగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్ సీడీ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్​ ప్రసాద్, బెల్లంపల్లి డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ సుధాకర్ నాయక్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వి.మధుసూదన్​రెడ్డి, వాలేటి శ్రీనివాస్​రావు, గోనె శ్యాంసుందర్​రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్​రెడ్డి, సెక్రటరీ చందూరి మహేందర్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు 
పాల్గొన్నారు.