- కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లిరూరల్,వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నెన్నెల మండలంలో ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. దోమల బెడద ఉందని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రతి రోజు యాంటీ లార్వా మందులతో ఫాగింగ్ చేయించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
ఫాగింగ్ యంత్రం లేకపోతే కొనుగోలు చేయాలన్నారు. పీహెచ్సీని తనిఖీ చేసి డాక్టర్లు, సిబ్బందితో మందుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్వ్యాధుల వ్యాప్తి చెందే ప్రస్తుత తరుణంలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు.
పల్లె ప్రగతి, ప్రజాపాలన, వనమహోత్సవం, అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. నర్సరీల్లో మొక్కలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అధికారులతో కలిసి మొక్కలు నాటారు. చిత్తాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు గదుల నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపివేయడం పట్ల ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ రమేశ, ఏపీఓ నరేశ్ ఉన్నారు.