క్రీడలతో మానసిక ఉల్లాసం: కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం సీఎం కప్ క్రీడా పోటీలను అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్ వీరు, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంగళవారం వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, నెట్‌బాల్‌, యోగ పోటీలు జరిగాయి.

ఈ నెల 21వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల గదులు, కిచెన్, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. డీఈవో యాదయ్య, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా షెడ్యూల్డ్ కులాల ఉపసంచాలకుడు పోటు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో తనిఖీలు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్, ల్యాబ్ తో పాటు వివిధ విభాగాలు, వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.