సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్​ కుమార్​ దీపక్

మంచిర్యాల, వెలుగు: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ, ప్రైవేట్ ​డాక్టర్లు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​ కుమార్​ దీపక్ ​ఆదేశించారు. శనివారం డీఎంహెచ్​వో హరీశ్ రాజ్, జీజీహెచ్​ సూపరింటెండెంట్​ హరిశ్చంద్రారెడ్డితో కలిసి డాక్టర్లతో సీజనల్ వ్యాధులు, క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్​పై రివ్యూ నిర్వహించారు. జిల్లా, మండల, ఉప కేంద్రాల పరిధిలో టాస్క్​ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్​ యాజమాన్యాలు రూల్స్​ పాటించాలని, డెంగ్యూ కేసులు నమోదైతే డీఎంహెచ్​వోకు సమాచారం అందించాలని సూచించారు. 

దోమల నివారణకు పంచాయతీ, మున్సిపాలిటీల సమన్వయంతో చర్యలు చేపట్టాలని, ప్రభావిత గ్రామాల్లో మెడికల్ ​క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు చేపట్టాలని, స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించా లని ఆదేశించారు. అనంతరం ‘సిజేరియన్లు వద్దు.. సాధారణ ప్రసవాలు ముద్దు’ అనే పోస్టర్లను కలెక్టర్ రిలీజ్ ​చేశారు. ప్రోగ్రామ్ అధికారులు ఎస్.అనిత, ప్రసాద్, సుధాకర్, కోటేశ్వరరావు, ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్​ డాక్టర్ పి.రమణ, డెంటల్ అసోసియేషన్ సభ్యుడు ​శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.