స్కూళ్లలో పనులు కంప్లీట్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి 

సిద్దిపేట, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన స్కూళ్లలో పనులు కంప్లీట్​చేయాలని కలెక్టర్​మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో జిల్లా విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. జిల్లాలో  814 స్కూళ్లకు గాను 465 స్కూళ్లలో  పనులు పూర్తి చేసినందుకు రూ. 16 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

మిగిలిన 349 స్కూళ్లలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తికాగానే ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్ జనరేట్ చేయాలని , పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇప్పటివరకు పనులు మొదలుకాని స్కూళ్లను విజిట్ చేసి పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ నెలాఖరులోగా స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో సైతం పనులు చేపట్టాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి, ఆర్ అండ్ డబ్ల్యూ, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. 

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి

కొండపాక: పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్​మనుచౌదరి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శంభు దేవాలయ ఆవరణలో మూడు రోజుల నుంచి ప్రీ స్కూల్ విధానం పై నిర్వహిస్తున్న తరగతుల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్​ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు.  చిన్న పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా సులువైన పద్ధతిలో వారికి బోధించాలన్నారు.

పిల్లలు ఆహారం తీసుకునే విధానాన్ని గమనించి తల్లిదండ్రులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పిల్లల ఎత్తు,  బరువు నమోదు చేయాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, సిబ్బంది శ్రీనివాస్, జాగృతి క్లబ్ అధ్యక్షుడు బుచ్చి రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.