చారిత్రక ప్రదేశాల వద్ద బ్యూటిఫికేషన్ పనులు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సుందరీకరణ పనులను చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని శ్యామ్ ఘడ్ కోట, ధర్మసాగర్ చెరువు (మినీ ట్యాంక్ బండ్) ను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. శ్యామ్ ఘడ్ కోట వద్ద చేపట్టనున్న ఫుట్ పాత్, రోడ్డు వెడల్పు, విద్యుత్ దీపాల ఏర్పాటు పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పురాతన కట్టడాల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. చారిత్రాత్మక ప్రదేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్ కుమార్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ హరిభువన్, నిర్మల్ అర్బన్ తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.