నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ప్రతిభను మెరుగుపరుచుతాయని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సీఎం కప్ 2024 జిల్లాస్థాయి క్రీడా పోటీలను సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ స్ట్రీడియంలో ప్రారంభించి మాట్లాడారు. సీఎం క్రీడలు యువతకు క్రీడా ప్రాముఖ్యతను చాటి చెప్పే గొప్ప వేదిక అన్నారు. ఈ పోటీల్లో మండల స్థాయిలో సక్సెస్ఫుల్గా నిర్వహించామని.. నేటి నుంచి 4 రోజులపాటు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు.
కబడ్డీ, ఖోఖో, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, ఆర్చరీ, జూడో పోటీలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 18 మండలాల నుంచి సుమారు 1700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ కమర్ అహ్మద్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో..
ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని పేర్కొన్నారు. ఈనెల 21 వరకు జిల్లా స్థాయిలో కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, బాడ్మింటన్ బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, చెస్, బాక్సింగ్, స్విమ్మింగ్ తో పాటు మరికొన్ని రకాల క్రీడలు ఉంటాయని తెలిపారు. డీవైఎస్ వో వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.