- కమిషనర్ తొలగింపునకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్టు
- సంఘటనపై విచారణ జరిపిన ఆర్జేడీ
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాల్టీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వర్సెస్ కమిషనర్ మధ్య కోల్డ్ వార్ ముదిరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో కమిషనర్ ను చైర్‌పర్సన్‌కు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లు బలవంతంగా వేదిక నుంచి దింపి కింద అధికారులతో కూర్చోబెట్టిన సంఘటన చిలికి చిలికి గాలి వానలా మారింది. తనను వేదిక మీదనుంచి దింపారన్న అవమానంతో కమిషనర్ ప్రసన్న రాణి వారం రోజుల నుంచి సెలవులో ఉన్నారు. చైర్పర్సన్భర్త, మాజీ చైర్మన్ చెప్పినట్టు వినడంలేదని కమిషనర్‌పై కక్ష గట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్, ఎంఐఎం కౌన్సిలర్లు మండిపడుతున్నారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో రగులుతున్న వివాదం రచ్చకెక్కడంతో మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. గురువారం ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి బల్దియాకు వచ్చి విచారణ చేపట్టారు. చైర్పర్సన్అనుకూల వర్గం, ఘటన జరిగిన నాటినుంచి సెలవులో ఉన్న కమిషనర్విచారణ కు హాజరయ్యారు.
కక్ష గట్టి.. వేధింపులు
సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ కు అండగా ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ,ఎంఐఎం కౌన్సిలర్లు కమిషనర్ పక్షం నిలిచారు. పదేళ్లుగా సిద్దిపేట మున్సిపాల్టీలో ఏకపక్షంగా వ్యవహరించిన మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత చైర్ పర్సన్ భర్త పాలనా వ్యవహారాల్లో జోక్యం వల్లనే ఈ సంఘటన జరిగినట్టుగా ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాల్టీలో చైర్ పర్సన్ భర్త ఆధిపత్య ధోరణే వివాదాలకు ఆజ్యం పోసినట్టు తెలుస్తోంది.
గత దశాబ్ద కాలంగా ఏక పక్షంగా సాగిన మున్సిపల్ పాలనలో తాము ఏదనుకుంటే అది చేసిన నేతలు ఇప్పుడు ఆటలు సాగక పోవడంతో వివాదాలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే మీటింగ్ లో అవినీతి అంశాలను లేవనెత్తి అధికారులనే టార్గెట్‌చేస్తున్నారని, ఇందులో భాగంగానే కమిషనర్‌ను వేధించారని అంటున్నారు.
కొన్ని ఫైళ్లపై కమిషనర్ చైర్పర్సన్ చెప్పినట్టు నిర్ణయం తీసుకోకపోవడంతో ఈమధ్య జరిగిన జనరల్‌బాడీ మీటింగ్‌లో ఆమెను అవమానించినట్టు తెలుస్తోంది. కమిషనర్ వేదిక దిగకుంటే తాము మీటింగ్ ను బైకాట్ చేస్తామని బీఆర్ఎస్కౌన్సిలర్లు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. దీంతో కమిషనర్ ప్రసన్న రాణి మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లారు.
ఆర్జేడీ విచారణతో వివాదం మరోసారి తెరపైకి..
సిద్దిపేట మున్సిపల్ సమావేశంలో మహిళా కమిషనర్ కు అవమానం జరిగిందనే వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనతో ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి రెండు రోజుల కింద మున్సిపల్ ఆఫీసులో విచారణకు రావంతో సెలవులో ఉన్న కమిషనర్ సైతం ఆఫీసుకు వచ్చారు. ఆర్జేడీ పర్యటనతో పది రోజుల కింద జరిగిన సంఘటనతో పాటు ఇంతర అంశాలు మల్లీ తెరపైకి వచ్చాయి.
శ్రీనివాస రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ లతో మాట్లాడాలని ప్రయత్నించగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం హాజరై కమిషనర్ పై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు మున్సిపల్ ఆఫీసులో అధికారులు, కౌన్సిలర్లతో, ఉద్యోగుల తో ఆర్జేడీ మాట్లాడి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్జేడీ విచారణ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల కు సమాచారం ఇవ్వక పోవడం గమనార్హం.
అక్రమాలకు సహకరించనందుకే కక్ష
సిద్దిపేట మున్సిపాల్టీలో అక్రమాలకు సహకరించనందుకే మహిళా కమిషనర్ పై కక్షపూరితంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు సాకి బాలలక్ష్మి ఆనంద్, శ్రీదేవి బుచ్చిరెడ్డి, రియాజ్, ఎంఐఎం కౌన్సిలర్ అర్షద్ ఆరోపించారు. గురువారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చైర్ పర్సన్ భర్త మున్సిపల్ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తమకు అనుకూలంగా సంతకాలు చేయాలని కమిషనర్ పై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. ఒత్తిళ్లకు తలొగ్గక పోవడంతో మహిళ కమిషనర్ ను అవమానించే విధంగా సర్వ సభ్య సమావేశంలో వేదిక పై నుంచి కిందికి దింపించారని వెల్లడించారు.
పదేండ్లుగా ఏకపక్షంగా మున్సిపాల్టీలో అవినీతి పాలన సాగించి దాన్ని కొనసాగించాలనే తాపత్రయంతో మహిళా కమిషనర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఇరవై ఏళ్లుగా మాజీ చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని కోరుతూ తాము జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ను కోరుతామని తెలిపారు.
కమిషనర్ ను అవమానించిన విషయంపై మున్సిపల్ ఆర్జేడీ ఆఫీసుకు వస్తే ప్రతి పక్ష కౌన్సిలర్లుకు సమాచారం ఇవ్వకుండా కేవలం చైర్ పర్సన్ కు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను రప్పించి కమిషనర్ కు వ్యతిరేకంగా చెప్పించారని ఆరోపించారు. చైర్ పర్సన్ భర్త చేస్తున్న ఇల్లీగల్ పనుల వల్ల సిద్దిపేట ప్రతిష్ట దెబ్బతింటుందని త్వరలోనే బీఆర్ఎస్ లోని కొంతమంది కౌన్సిలర్ల సాయంతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు ప్రకటించారు.