మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలి : జోగు రామన్న

ఆదిలాబాద్ టౌన్/నేరడిగొండ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు స్వరూప రాణి, కస్తాల ప్రేమల, బొడగం మమత, పర్వీన్, కరుణ తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మండల బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సభను పక్కదోవ పట్టించేందుకు మహిళలను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. సీఎం దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి, దహనం చేశారు. మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ తదితరులు పాల్గొన్నారు.