దుర్గకు అండగా ఉంటం చదువు బాధ్యత ప్రభుత్వానిదే.. : సీఎం రేవంత్ రెడ్డి

  • అన్ని విధాలుగా హెల్ప్ చేయాలని కలెక్టర్​కు ఆదేశం

భైంసా, వెలుగు: నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని తానూర్‌‌‌‌‌‌‌‌ మండలం బెల్‌‌‌‌‌‌‌‌ తరోడాకు చెందిన చిన్నారి దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. గతంలో తండ్రి చనిపోగా.. తాజాగా తల్లి గంగామణి కూడా ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బుల్లేకపోవడంతో చిన్నారి దుర్గ భిక్షాటన చేసింది. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

దుర్గ చదువుతో పాటు అన్ని విధాలుగా అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్​ను సీఎం ఆదేశించారు. ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్​లో జాయిన్ చేయించాలని సూచించారు. కాగా, ఇప్పటికే చిన్నారి దుర్గతో కలెక్టర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అందరూ అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాల్సిందిగా సూచించారు. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో పాటు జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్కతోనూ ఆమె మాట్లాడారు. అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా రూ.10వేలు ప్రభుత్వ తరఫున అందించినట్లు చెప్పారు.

పెద్దన్నలా నేనున్నా బిడ్డ : ఎమ్మెల్యే రామారావు పటేల్

దుర్గకు పెద్దన్న మాదిరి తాను ఉన్నానంటూ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భరోసా ఇచ్చారు. సోమవారం బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అవసరమైతే సొంత డబ్బులతో ప్రైవేట్ స్కూల్​లో చదివిస్తానని చెప్పారు. బీజేపీ తానూర్ మండల అధ్యక్షులు యాతలం చిన్నారెడ్డి రూ.5వేలు ఆర్థిక సాయంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతుల మీదుగా అందజేశారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటాం: మాజీ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి

దుర్గను ఆదుకుంటామని, ఆమె పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సోమవారం బాలికను ఆయన పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి బాలిక విషయంపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట పార్టీ లీడర్లు బాశెట్టి రాజన్న, మధు పటేల్, గోప సాయినాథ్ తదితరులున్నారు.

నిన్ను బాగా చదివిస్తా.. ధైర్యంగా ఉండు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చిన్నారి దుర్గకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. తానూర్ తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో అబ్దుల్ సమద్ తో పాటు స్థానిక నేతలను ఆ బాలిక ఇంటికి పంపించి వీడియో కాల్ లో ఆయనతో మాట్లాడించారు. మంత్రి కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష అందజేశారు. మంత్రి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిన్ను బాగా చదివిస్తా.. ఇల్లు కట్టిస్తా.. ఏమైనా సమస్య ఉంటే తహసీల్దార్ కు చెప్పు.. ఆయన నాకు చెప్తాడు. త్వరలో వచ్చి కలుస్తా.. ధైర్యంగా ఉండు’’అంటూ ఆ బాలికతో మంత్రి అన్నారు.