కేసీఆర్, హరీశ్​కు గుణపాఠం చెప్పాలి : రేవంత్​రెడ్డి

  •     బీజేపీ, బీఆర్​ఎస్ నుంచి మెదక్​కు విముక్తి కల్పించాలి
  •     ఎంపీగా నీలం మధును లక్ష మెజార్టీతో గెలిపించాలి
  •     ​ రఘునందన్​ రావు, వెంకట్రామిరెడ్డిని ఓడించాలి 
  •     నర్సాపూర్​జన జాతర సభలో సీఎం రేవంత్​రెడ్డి

మెదక్​, నర్సాపూర్​, వెలుగు: " మెదక్​లోక్​సభ నియోజకవర్గం ఇరవై ఐదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ల చేతిలో మగ్గిపోయింది. ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతిలో ఉంది. ఈ లోక్​ సభ ఎన్నికల్లో మెదక్​ ఎంపీగా బడుగు, బలహీన వర్గాల బిడ్డ అయిన కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.  కేసీఆర్, హరీశ్​రావుకు​ గుణపాఠం చెప్పాలి "  అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నర్సాపూర్​ లో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు.  

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి దేశ చరిత్రలో గొప్ప పేరు ఉందన్నారు. 1980లో ఇందిరాగాంధీ మెదక్ లోక్​ సభ ఎన్నికల్లో బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలవడంతోపాటు ఈ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఆమె ఆధ్వర్యంలోనే బీడీఎల్​, బీహెచ్ఈఎల్, పటాన్​చెరులో పారిశ్రామిక వాడ, రామచంద్రపురంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రస్తుతం మెదక్​లోక్​సభ స్థానంలో నీలం మధును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపామన్నారు. బీజేపీ నుంచి నిలబడ్డ అభ్యర్థి రఘునందన్​ రావు, పీఎం నరేంద్ర మోదీ నుంచి కోట్ల రూపాయలు తీసుకువస్తానని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వులు పెడితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టి, ఉప్పు పాతరేశారన్నారు.

బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్ , రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కోసం వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి ప్రభుత్వం గుంజుకుంటుంటే వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా, పోలీసుల బూట్ల కింద రైతులను అణచివేశారని ఆరోపించారు.  వెంకట్రామిరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడని, కేసీఆర్​కు, హరీశ్​ రావు​కు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడని అందుకే కరీంనగర్ నుంచి తీసుకువచ్చి మెదక్ ఎన్నికల బరిలో నిలిపారని ఆరోపించారు. మొత్తం మెదక్ జిల్లాలో పార్లమెంట్ పరిధిలో  ఒక్క మగాడు దొరకలేదా అని ప్రశ్నించారు.

నిన్న నర్సాపూర్​ ప్రచార సభలో  కేసీఆర్..​మదన్ రెడ్డిని ఏదేదో అని పోయారని, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం వల్లే  మీరు ఓడిపోయారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో మీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని, దానికి నర్సాపూర్ నుంచి పునాదులు పడతాయన్నారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు, మెదక్​ ఎమ్మెల్యే రోహిత్​, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మదన్ రెడ్డి, హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్​ దేవేందర్​రెడ్డి, కాంగ్రెస్​ నాయకులు ఆంజనేయులు గౌడ్​, రాజిరెడ్డి, రవీందర్​రెడ్డి, సుహాసిని రెడ్డి, శేషసాయి రెడ్డి పాల్గొన్నారు.