రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు : సీఎం రేవంత్

  • రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్ షా ప్లాన్
  • కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు.. 
  • ఢిల్లీ సుల్తాన్​లు కేసులు పెడ్తే భయపడ్తనా? 
  • తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్​ల ప్రయత్నం 
  • పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతం 
  • సిద్దిపేటలో లక్ష మంది రైతులతో సభ పెడ్తానని వెల్లడి 
  • ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్​లో సీఎం ప్రచారం 

ఆసిఫాబాద్/సిద్దిపేట/జీడిమెట్ల, వెలుగు: రిజర్వేషన్లు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే దేశంలో జనగణన చేపట్టడం లేదని అన్నారు. ‘‘రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ చూస్తున్నది. మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచే జనాభా లెక్కలు మొదలయ్యాయి. 1881 నుంచి ప్రతి పదేండ్లకు ఓసారి జనాభా లెక్కలు తీస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ప్లాన్ చేశారు. అందుకే 2021లో జరగాల్సిన జనగణన ఇప్పటి వరకు చేయలేదు” అని సీఎం చెప్పారు.

ఈసారి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ అడుగుతున్నది. ఎందుకంటే 400 సీట్లు వస్తే ఏకపక్షంగా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చని చూస్తున్నది. ఈ లోక్ సభ ఎన్నికల్లో మీరు బీజేపీకి ఓటు వేస్తే.. అది రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు వేసినట్టే అవుతుంది” అని అన్నారు. ‘‘రిజర్వేషన్ల రద్దుపై ప్రశ్నించినందుకు నాపై ఢిల్లీ పోలీసులతో అమిత్ షా కేసులు పెట్టించిండు. కేసీఆర్ పదేండ్లలో నాపై 200 కేసులు పెట్టించి, జైలుకు పంపితేనే భయపడలేదు. అలాంటిది ఢిల్లీ సుల్తానులు కేసులు పెట్టిస్తే భయపడ్తనా? భయం నా రక్తంలోనే లేదు” అని చెప్పారు. 

గురువారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్​కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణకు మద్దతుగా నిర్వహించిన జనజాతర సభ, మెదక్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ సభలో, మల్కాజిగిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఢిల్లీ సుల్తానులు తెలంగాణ మీద దాడి చేయాలని చూస్తున్నారని, దాన్ని ప్రజలు అడ్డుకోవాలన్నారు. డిసెంబర్​లో కేసీఆర్​కు బై బై ​చెప్పారని, మేలో మోదీకి బై బై ​చెప్పాలని కోరారు. 

మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు.. 

పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేం లేదని రేవంత్ మండిపడ్డారు. ఏది అడిగినా కేంద్రం ఖాళీ చేయి చూపించిందని ఫైర్ అయ్యారు. విభజన హామీలను అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన మోదీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. ‘‘ఆదిలాబాద్​సెగ్మెంట్ కు 18 సార్లు ఎన్నికలు జరిగితే ఎప్పుడూ పురుషులే పోటీ చేశారు. కానీ మొదటిసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక‌ ఆదివాసీ ఆడబిడ్డకు అవకాశం ఇచ్చారు. సుగుణక్క దగ్గర డబ్బు, పలుకుబడి లేదు. 

కానీ టీచర్ గా ప్రజల సమస్యలు తీర్చగలిగే సత్తా ఆమెకు ఉన్నది” అని కొనియాడారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు హయాంలో ఆదిలాబాద్ కి దక్కిందేమీ లేదని విమర్శించారు. ‘‘సోయం బాపూరావును బీజేపీ మోసం చేసి, ఇంకో దొర గొడం నగేశ్ కి సీటు ఇచ్చింది. నగేశ్ కు ఆదివాసీలు షేక్ హ్యాండ్ ఇస్తే, ఆయన వెంటనే చేతులు కడుక్కుంటడు. అలాంటి వ్యక్తి ప్రజలకేం సేవ చేస్తడు” అని ప్రశ్నించారు. 

పదేండ్లు అటు ప్రధాని మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ‘‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదివాసీ గర్జన మహాసభ నిర్వహించాం. గెలిచిన తర్వాత ఇంద్రవెల్లిలో సభ నిర్వహించాం. కుమ్రంభీమ్ స్ఫూర్తిగా ఆదివాసీ, గిరిజనులతో సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నం. త్వరలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం” అని హామీ ఇచ్చారు. 

ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి.. 

సిద్దిపేటకు పట్టిన చీడపీడల్ని తొలగిస్తానని రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్, హరీశ్ రావు నుంచి మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను. వీళ్లు గత 45 ఏండ్లుగా ఇక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గడీలను బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు. ‘‘సిద్దిపేటలో ఎవరైనా ఎమ్మెల్యేగా, కౌన్సిలర్ గా, సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే.. ముందు పోలీసులు ఇంటికొచ్చి, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. 

ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురక పోతే శాశ్వతంగా బానిసలుగా మిగిలిపోతారు. మెదక్ సెగ్మెంట్ కు ఆనాడు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తే, ఇప్పుడు బీసీ బిడ్డ  నీలం మధుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. ఆరునూరైనా ఇక్కడ మధును గెలిపించుకోవాలి” అని చెప్పారు. నీలం మధును గెలిపిస్తే బీసీ–డీ గ్రూపులో ఉన్న ముదిరాజ్ లను బీసీ–ఏ గ్రూపులోకి తేవడానికి కృషి చేస్తారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ముదిరాజ్ బిడ్డకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ప్రకటించారు. 

వెంకట్రామిరెడ్డి రైతులను ముంచిండు.. 

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రాజెక్టుల పేరుతో జిల్లాలోని రైతుల భూములు గుంజుకున్నారని, ఆయనకు ఈసారి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ కోరారు. ‘‘వెంకట్రామిరెడ్డి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం తెచ్చారు? ఆయన రైతులను బందిపోటు దొంగల్లా జైళ్లకు పంపారు. వందల ఎకరాలు కొల్లగొట్టారు. దండం పెట్టి చెబుతున్నా ..  మీ భూములు గుంజుకున్న వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పండి” అని కోరారు. 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శిస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. దుబ్బాకకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  అద్దంకి దయాకర్ కు భవిష్యత్తులో మంచి పదవి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, సముద్రాల వేణుగోపాలచారి, పురాణం సతీశ్, రాములు నాయక్, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.  

హరీశ్​ లెక్క తేలుస్త.. 

కొమురవెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న.. పంద్రాగస్టు నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాణఫీ చేస్త. రైతులకు మరో స్వాతంత్ర్యం ఇస్తా. రైతు రుణమాఫీ చేసి లక్ష మంది  రైతులతో సిద్దిపేటలోనే సభ నిర్వహించి హరీశ్ రావు లెక్క తేలుస్తా. హరీశ్ రావు రాజీనామా చేసినంక, సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకుంటాను.

కేసీఆర్​కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్.. 

కేసీఆర్ కుంటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్​బెడ్​రూమ్ ఇల్లు కట్టిస్తామని రేవంత్ అన్నారు. ‘‘2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై కక్షకట్టి వేల మంది పోలీసులను పెట్టి, కొడంగల్ లో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలుకొట్టి పోలీస్​స్టేషన్​లో నిర్బంధించి ఓడించారు. దీంతో రేవంత్ పనైపోయిందని నా శత్రువులు సంతోషపడ్డారు. కానీ కాంగ్రెస్ నాకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తే, ఇక్కడి ప్రజలు నన్ను అక్కునచేర్చుకుని గెలిపించారు” అని చెప్పారు. ‘‘కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్​ఇండ్లు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ పేదలకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వలేదు గాని, పదేండ్లు దోచుకుని వందేండ్ల విధ్వంసం చేసిండు” అని మండిపడ్డారు. 

ఇయ్యాల కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అంశాలపై పీసీసీ రూపొందించిన మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, మేనిఫెస్టో కమిటీ చైర్మ న్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొంటారు. కాగా, రేవంత్ శుక్రవారం మూడుచోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు  ధర్మపురి బహిరంగ సభలో, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల బహిరంగ సభలో, సాయంత్రం 6:30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.