సమస్యలపై సీఐటీయూ వాల్ పోస్టర్ విడుదల: సీఐటీయూ

  • సమస్యలపై సీఐటీయూ వాల్ పోస్టర్ విడుదల

కోల్​బెల్ట్, వెలుగు: గని కార్మికుల సమస్యలపై సీఐటీయూ యూనియన్ వాల్ పోస్టర్ విడుదల చేసింది. ఆదివారం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ యూనియన్ ఆఫీసులో వాల్ పోస్టర్ విడుదల చేసిన నేతలు మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో అధికారికంగా సంప్రదింపులు జరపలేకపోతున్నామన్నారు.

పలుసమస్యలపై పోరాటానికి వాల్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి 3 శాతం వాటా చెల్లించాలని, సీఎంపీఎఫ్ ఆన్​లైన్​లో తప్పులను సరిచేసి పెండింగ్ చిట్టీలను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు రివైజ్డ్ పెన్షన్,  గ్రాట్యుటీ చెల్లించాలని, సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

 కోల్ ఇండియాలో అమలవుతున్న అలవెన్సులపై ఆదాయపన్ను మాఫీని సింగరేణిలో కార్మికులకు అమలు చేయాలని, సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో సంతకాలు సేకరించి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వెంకటస్వామి, అల్లి రాజేందర్, ఆర్గనైజర్లు జోరుక వెంకటేశ్, చైతన్య రెడ్డి, కల్వల శ్రీనివాస్, కాసిపేట-2 అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ధనిశెట్టి సురేశ్, సీనియర్ నేత సంజీవులు తదితరులు పాల్గొన్నారు.