మహిళల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత

నస్పూర్, వెలుగు: మహిళల రక్షణ, వారి భద్రత విషయంలో షీ టీమ్స్, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని మంచిర్యాల మహిళా పోలీస్​స్టేషన్​ సీఐ నరేశ్ కుమార్ అన్నారు. రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు నస్పూర్ ఏరియాలోని కస్తుర్బా స్కూల్ విద్యార్థులకు సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలు, ర్యాగింగ్, పొక్సో చట్టం, ఆత్మహత్యలు, మహిళా చట్టాలపై.. షీ టీమ్స్, భరోసా సెంటర్​తో కలిసి అవగాహన కల్పించారు.

సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుతోనే మంచి భవిష్యత్​ఉంటుందని, నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే షీ టీం, స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఓ మౌనిక, భరోసా కోఆర్డినేటర్ విజయ, షీటీం సిబ్బంది, భరోసా సిబ్బంది, టీచర్లు పాల్గొన్నారు.