శాంతిఖని పరిరక్షణకు ఏఐటీయూసీ పోరాటం : చిప్ప నర్సయ్య

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని పరిరక్షణకు ఏఐటీయూసీ నిరంతర పోరాటం చేస్తోందని ఏఐటీయూసీ బెల్లంపల్లి, కాసిపేట బ్రాంచీల ఇన్ చార్జి చిప్ప నర్సయ్య అన్నారు. గురువారం శాంతిఖని ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్​కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. గనిలో ఉత్పత్తి, ఉత్పాదకతను యాజమాన్యం పెంచకుండా కార్మికులపై పనిభారం మోపుతోందని ఫైర్ అయ్యారు. 

బొగ్గు గనిలో నడుస్తున్న 11 బెల్టులను క్లీన్ చేసి ఆ బెల్టుల ద్వారా బొగ్గు బయటికి వెళ్లేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు గని పరిరక్షణలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే సహించేందిలేదని హెచ్చరించారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ, గని పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, లీడర్లు వంతెన రమేశ్, భాస్కర్, పుట్ట రాయలింగు, మిట్టపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.