మిర్చికి వడల తెగులు .. విరగ కాసిన పంటంతా ఎండిపోతున్న వైనం

  • మందులు లేని రోగంతో నష్టపోతున్న రైతులు
  • పెట్టుబడి ఖర్చులు కోల్పోఁయామంటూ ఆవేదన

కాగజ్ నగర్, వెలుగు:  మిర్చి పంట చేతికొచ్చే సమయంలో వడల తెగులు(విల్ట్) సోకడంతో చేను నిలువునా ఎండిపోతుండగా రైతులకు దిగులు పట్టుకుంది. ఆసిఫాబాద్​జిల్లా కౌటాల మండలం తాటిపల్లి , గుడ్లబోరి, మొగడ్ ధగడ్ తదితర గ్రామాల్లో రైతులు 100 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. గత 15 రోజులుగా పంట వడల తెగులు బారిన పడింది.  ఏపుగా కాసిన మొక్కలు ఎండిపోతుండగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట కోసే సమయంలో తెగులు సోకడంతో పెట్టుబడి ఖర్చులు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఒక్కో ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు పెట్టామని, తెగులుతో అప్పుల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. కౌటాల ఏఈఓ ఘన్ శ్యామ్ ను రైతులు సంప్రదించగా వడల తెగులు సోకిన తర్వాత నివారణ కష్టమవుతుందని, నియంత్రణకు ఎలాంటి మందులు పని చేయడం లేదని తెలిపారు. ఒకసారి తెగులు సోకితే మొత్తం పంట నష్టం జరుగుతుందని, దీన్ని పంట మార్పిడితోనే  అరికట్టవచ్చని పేర్కొన్నారు. వడల తెగులు గాలి, నీరు, మనుషులతో పాటు ఇతర పంటలకు కూడా వ్యాపిస్తుందని చెప్పారు.