- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు : ప్రజలు సంతృప్తి చెందేలా పాలన అందిస్తానని, ప్రతి గ్రామంలో ఏడాదిలో రెండు అభివృద్ధి పనులు చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. చెన్నూరు మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్శ్రేణులతో కలిసి శనివారం ఆయన మార్నింగ్ వాక్ చేశారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దుగ్నెపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చెన్నూరు మండలం పరిధిలోని బుద్ధారం, కన్నెపల్లి, సంకారం, వడ్డెపల్లి, చింతలపల్లి, అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల్లో పర్యటించారు.
పట్టణ సమస్యలను ఒక్కొక్కటిగా అన్నింటినీ 100% పరిష్కరిస్తానన్నారు. పోడు సమస్యకు సంబంధించి డీఎఫ్‌వోతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. బుద్ధారం గ్రామానికి చెందిన పలువురు అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసేలా సర్కార్‌పై ఒత్తిడి తీసుకరావాలని ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్, చల్లా రామి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ రాజమల్లు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల బాప గౌడ్, చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.