విద్య, వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

  • ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • పదేండ్లలో చెన్నూరు సెగ్మెంట్​లో  అభివృద్ధి జరగలె
  • ప్రత్యేక ఫండ్స్‌‌‌‌తో నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా
  • ఊరుమందమర్రి వాగుపై బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి 
  • మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో చెన్నూరు ఎమ్మెల్యే పర్యటన

 కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని, పీహెచ్‌‌‌‌సీలు, హెల్త్ సబ్ సెంటర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో పర్యటించిన ఆయన.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు. 

చెన్నూరు నియోజకవర్గంలో కొత్తగా రెండు పీహెచ్‌‌‌‌సీలు, ఒక హెల్త్ సబ్ సెంటర్ మంజూరయ్యాయని, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయని తెలిపారు. భీమారంలో పీహెచ్‌‌‌‌సీకి శంకుస్థాపన చేసిన ఆయన ఆరు నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. గత పదేండ్లు చెన్నూరు నియోజకవర్గంలో పైసా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. 

చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో సైడ్ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సౌలతులు లేకపోవడంతో పదేండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఫండ్స్ మంజూరు చేయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఊరు మందమర్రిలో డీఎంఎఫ్‌‌‌‌టీ ఫండ్స్‌‌‌‌తో సైడ్ డ్రైన్స్ నిర్మిస్తామన్నారు. అభివృద్ధిలో చెన్నూరు నియోజకవర్గాన్ని నంబర్ వన్‌‌‌‌గా మారుస్తానని తెలిపారు.
 
ఊరు మందమర్రి వాగుపై బ్రిడ్జి.. 

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. గురువారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఊరుమందమర్రి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో మార్నింగ్ వాక్ చేశారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద వాగుపై బ్రిడ్జి లేక రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, వానాకాలం విద్యార్థులు స్కూళ్లకు.. రైతులు పొలాలకు వెళ్లేకపోతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 

వాగు దాటుతూ పలువురు వరదలో కొట్టుకుపోయారని గుర్తుచేశారు. పదేండ్లుగా బ్రిడ్జి నిర్మించాలని కోరుతుతన్నా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్పందిస్తూ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి.. ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డితో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఊరుమందమర్రి, ఎర్రగుంటపల్లిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

 పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్‌‌‌‌ సరిగ్గా లేకపోవడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌, ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. వెటర్నరీ హాస్పిటల్‌‌‌‌లో మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత డాక్టర్‌‌‌‌‌‌‌‌ను, వార్డుల్లో కరెంట్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌‌‌‌కో ఆఫీసర్లను ఫోన్‌‌‌‌లో ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మందమర్రి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ సొతుకు సుదర్శన్, ఎండీ నయీమ్, సాయికృష్ణ, కత్తెర్ల సంజీవ్ పాల్గొన్నారు.