- ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి కృషి చేస్త
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల శివారులో కుంటలో పడి చనిపోయిన రాజ్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. విషయం తెలిసిన వెంటనే మృతుడు రాజ్‌కుమార్ తల్లిదండ్రులు విష్ణువర్ధన్, రమాదేవిని పరామర్శించానని తెలిపారు. మృతుడి ఫ్యామిలీని ఆదుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ను కలిసినట్లు చెప్పారు.
మృతుడి కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేలా ఒప్పించానని తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు. రాజ్‌కుమార్ ఫొటో వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. రూ.15 లక్షల చెక్కు రెండు రోజుల్లో అందుతుందని వివరించారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎవరు చేస్తారో నిర్ణయించుకోవాలని వారికి సూచించారు. టేకుమట్ల గ్రామానికి చెందిన మహ్మద్ అభిబా, ఇందారం గ్రామానికి చెందిన నిమ్మల చందు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబాలను వివేక్ పరామర్శించారు. తమ పిల్లలకు జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పించాలని టేకుమట్ల గ్రామానికి చెందిన పలువురు మహిళలు వివేక్‌ను కోరారు. స్పందించిన ఆయన.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో గంగిపల్లివాసిని..
హైదరాబాద్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జైపూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రాజయ్యను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఇటీవల రాజయ్యకు పక్షవాతం వచ్చింది. రాజయ్యను పరామర్శించి హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లను వివేక్ వెంకటస్వామి అడిగి తెలుసుకున్నారు.