అసత్య ప్రచారాలు చేస్తే సహించేదిలేదు చెన్నూర్ కాంగ్రెస్​ లీడర్లు

  • అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఫండ్స్​కేటాయిస్తున్నారని వెల్లడి 

చెన్నూర్, వెలుగు: ప్రజల అకాంక్షల మేరకు చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కట్టుబడి పనిచేస్తున్నారని కాంగ్రెస్​ లీడర్లు పేర్కొన్నారు. బుధవారం చెన్నూర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోటపల్లి మండలం నక్కలపల్లికి వెళ్లే మార్గంలోని లోతట్టువాగు కాజ్​వే గతంలో ఎన్నోసార్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇటీవల కూడా కొట్టుకు పోతే గ్రామస్తులు ఎమ్మెల్యే వివేక్​ దృష్టికి తీసుకెళ్లా రని, ఆయన కాజ్​వే  ప్రాంతాన్ని సందర్శించి గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా టెంపరరీ రిపేర్లు చేయించారని చెప్పారు. సంబంధిత ఆర్అండ్​బీ ఆఫీసర్లతో మాట్లాడి ఎస్టిమేషన్ ​వేయించి బ్రిడ్జి ఏర్పాటు కోసం రూ.28 లక్షల ఫండ్స్​ను మంజూరు చేయించారని గుర్తుచేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్​ కేటాయింపు విషయంపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు కాంగ్రెస్​ సర్కార్​పై అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

అప్పటి పాలకుల నిర్లక్ష్యమే గ్రామస్తులకు శాపంగా మారిందన్నారు. ఎమ్మెల్యే వివేక్​ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన ఫండ్స్​ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే కేంద్ర అటవీశాఖ మంత్రిని ఒప్పించి వాటి నిర్మాణానికి అవసరమైన పర్మిషన్లు తీసుకురావాలని బీజేపీ లీడర్లకు సవాల్​ విసిరారు. కాంగ్రెస్​సర్కార్​వచ్చిన 8 నెలల కాలంలోనే రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కోసం ఎమ్మెల్యే పెద్ద ఎత్తున  ఫండ్స్​ సాంక్షన్​ చేయించి పనులుకూడా  చేయిస్తున్నారని చెప్పారు. సమావేశంలో చెన్నూర్​పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న సూర్యనారాయణ, సీనియర్ నేత హేమవంతరెడ్డి, కోటపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమల్లు గౌడ్, మండల అధ్యక్షుడు మహేశ్ తివారీ, లింగంపల్లి మహేశ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.