నియోజకవర్గ అభివృద్ధికి కృషి :ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన
  • పలు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలపై ఆరా 

కోల్​బెల్ట్/చెన్నూర్/లక్సెట్టిపేట, వెలుగు : నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూరు మండలం సుద్దాల, కమ్మరిపల్లి, తుర్కపల్లి, లింగంపల్లి  గ్రామాల్లో  ఎమ్మెల్యే  మార్నింగ్​ వాక్​లో పాల్గొని గ్రామస్తుల సమస్యలను అడిగితెలుసుకునున్నారు.

వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. తుర్కపల్లిలో రూ.15లక్షలతో సీసీ రోడ్లు, తాగునీటి కోసం బోరు మోటర్​ సదుపాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే ముత్తరావుపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో సైడ్​డ్రైయిన్స్, రోడ్లు నిర్మిస్తామని, తాగునీటి కష్టాలను తీరుస్తామని చెప్పారు.

కమ్యూనిటీ హాల్​కు మాల సంఘం వినతి

లక్షేట్​పేట పట్టణంలోని గోదావరిరోడ్​లో మాల మహానాడు కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి ఫండ్స్​ కేటాయించాలని శుక్రవారం సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మాల సంఘం లీడర్లు వినతిపత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందించారు. అంతకుముందు వారికి ఊట్కూర్​ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గరిసె రవీందర్, మినుముల శాంతి కుమార్, బైరం లింగన్న, పెండం రాజన్న, ప్రేమ్ సాగర్, రాజు, రవి, కిషోర్, తదితరులు పాల్గొన్నారు. చెన్నూరులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్​టైమ్​టీచర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే, ఎంపీకి వినతిపత్రం అందజేశారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ 

చెన్నూరు, లక్షేట్​పేట మండలాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, పురాణం సతీశ్​కుమార్, మాజీ జడ్పీ చైర్మన్​ మూల రాజిరెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్​ సీనియర్​లీడర్, అఖిల భారత యాదవ సంఘం డిస్ర్టిక్ట్​  ప్రెసిడెంట్​బండి సదానందంయాదవ్​ అత్త అగ్గుపోశవ్వ, చెన్నూరులో బీజేపీ లీడర్​ రాపర్తి వెంకటేశ్వర్​ తల్లి సమ్మక్క  ఇటీవల మృతిచెందారు.

వారి కుటుంబాలకు ఎంపీ, ఎమ్మెల్యే  ధైర్యం చెప్పారు. చెన్నూరు మండలం సోమన్​పల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్​, మాజీ ఎంపీటీసీ  భీమిని బాపగౌడ్​ తల్లి లక్ష్మిబాయి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు.  కార్యక్రమాల్లో చెన్నూరు, కోటపల్లి, జైపూర్​ మండలాలకు చెందిన కాంగ్రెస్​ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.