- ప్రాజెక్టు వద్ద వెంటనే ప్రెజర్ సర్వే చేపట్టాలని కోరాం
- కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ఏటా పంటలు మునిగిపోతున్నయ్
- కమీషన్ల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టు కట్టిండు
- అన్నారం బ్యారేజీ వద్ద మునిగిన పంట పోలాలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. పంటలు మునగకుండా కరకట్టలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల వద్ద నిర్మించిన అన్నారం బ్యారేజీ వరద వల్ల నీట మునిగిన పంట పొలాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఐదేండ్లుగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
బ్యాక్ వాటర్ వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని తాను చాలాసార్లు గత పాలకులను డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కొట్లాడారని, ఆయన కోరుకున్నట్టు తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అక్కడి నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్లు వస్తాయని, దీంతో మిగతా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు వీలుండేదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమేలేదని, కమీషన్ల కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.33 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టును రూ.1.25 లక్షల కోట్లకు వ్యయాన్ని పెంచి దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ది చేద్దామన్న సోయి కేసీఆర్‌కు లేకుండా పోయిందని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద వెంటనే కరకట్టలు కట్టాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరానని చెప్పారు.
ప్రెజర్ సర్వే తర్వాత పరిహారంపై స్పష్టత..
అన్నారం బ్యారేజీ వద్ద కరకట్టల నిర్మాణానికి ముందు ఒక్కసారి ప్రెజర్ సర్వే చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ సూచనతో ఒక స్టడీ చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. తొందరగా స్టడీ చేసి కరకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు మంజూరు చేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏటా వర్షాకాలంలో మంథని, భూపాలపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఐదేండ్లుగా వేల ఎకరాల్లో పంటలు మునిగి నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు అన్నారం బ్యారేజ్ వరద వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అంశాన్ని సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లానని, మంగళవారం మంచిర్యాల ఆర్డీవో వేణు, అన్నారం బ్యారేజ్ ఆఫీసర్లతో కలిసి పొలాలను పరిశీలించానని చెప్పారు. పరిహారం విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇప్పించేలా కృషి చేస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నష్టపోయిన రైతులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం ఇవ్వలేదన్నారు.
ఇప్పటికి కోటపల్లి మండలం బబ్బెరచెలకలో, జైపూర్, చెన్నూరు మండలాల్లో సుందరశాలలో ప్రాజెక్టు కింద కోల్పోయిన ల్యాండ్‌కు పరిహారం ఇప్పించాల్సి ఉందని చెప్పారు. పరిహారం అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కాంగ్రెస్ లీడర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
తాగునీటి సప్లై కోసం అమృత్ స్కీం..
చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో తాగునీటి సప్లై వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అమృత్ స్కీం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మూడు మున్సిపాలిటీల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న అమృత్ 2.0 ఫండ్స్ కేటాయింపు, టెండర్ల ప్రక్రియ, పనుల ప్రారంభంపై చర్చించారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పథకాన్ని చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. ట్యాంకుల నిర్మాణానికి స్థలాలు చూడాలన్నారు.
స్కీమ్ అమలు కోసం ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్‌తో పాటు బైక్‌పై తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. మరోవైపు, భీమారం మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పక్కన గల ఖాళీ స్థలాన్ని వివేక్ పరిశీలించారు. స్థలానికి సంబంధించిన వివరాలను వారంలో ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద ఫ్రాడ్..
కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఫ్రాడ్ అని, దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని వివేక్ అన్నారు. తన కుటుంబం రూ.వేల కోట్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లను ప్రపంచ ధనికులను చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మనీ మేకింగ్ మిషన్‌గా కేసీఆర్ ఆయన ఫ్యామిలీ వాడుకుందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఇరిగేషన్‌పై ఎలాంటి అవగాహన లేదన్నారు.
పంపులు స్టార్ట్ చేయకపోతే 50 వేల మంది రైతులతో మేడిగడ్డ వద్ద ధర్నా చేస్తానని కేటీఆర్ మూర్ఖంగా మాట్లాడారని మండిపడ్డారు. 1,280 టీఎంసీల నీళ్లు వాడుకునే ప్రాజెక్టు అయినా.. కేవలం 260 టీఎంఎసీలే వాడుకున్నారని, అందులో 200 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ చేయడం వల్ల వచ్చినవేనన్నారు. ఈ ప్రాజెక్టు వేస్ట్ అయ్యిందని, దీంతో రైతుల భూముల ధరలు తగ్గిపోయాయన్నారు.