కేవలం నోటి మాటలతో ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు బాధాకరమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాలలో వర్గీకరణ చేయొచ్చు అనే నోటి మాటలతో ఏబీసీడీ వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.  ఆదిలాబాద్ లో మాలల మహాసభకు హాజరైన వివేక్.. భవిష్యత్తు లో ఇలాంటి జడ్జిమెంట్ తో రిజర్వేషన్లు వెత్తేసే కుట్ర జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పులో ఎస్సీల గురించి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. నిజంగా ఎస్సీలలో ఉన్న పేదరికాన్ని, వివక్షను గురించి మాట్లాడి.. వెనక బడిన వారిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా మాట్లాడాల్సిందని అన్నారు.

ఎస్సీ కులాలలను విభజించి రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతోందని,  దళితులను మరింత బలహీన పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. గత 3 వేల ఏండ్లుగా దళితులపై కుల వివక్ష ఉందని.. అదే విధంగా 3 వేల ఏండ్ల నుంచి మాలలపై వివక్ష ఉందని.. అది ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. 

రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఎక్కువ దక్కాయో లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మాలలను మరింత బలహీన పరిచేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని రాజకీయ నాయకులు  నమ్ముతున్నారని, వారిపై ఒత్తిడి చేయడం వలన వారికి నిజానిజాలేంటో తెలుస్తాయని అన్నారు. 

అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరమని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఎమ్మెల్యే వివేక్ విమర్శించారు.  అమిత్ షా మాటలనే అందరూ నమ్ముతున్నారని, దళితులపై వారి దృక్పథం ఎప్పటికీ మారదని అన్నారు.

ALSO READ | ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మూడేళ్ల నుంచి మాలలపై కుట్ర జరుగుతోందని, మాలల గురించి మాట్లాడితే తనపై పై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చాలా మంది అంటున్నారని అన్నారు. ఏది ఏమైనా మాలల హక్కులను కాపాడే బాధ్యత తనపై ఉందని, అందరి సహకారంతో ముందుకెళ్తానని తెలిపారు. 

మాలలను మరింత బలహీన పరిచే కుట్ర జరుగుతుందని, కానీ మాలల సత్తా ఏమిటో సింహ గర్జరన తర్వాత అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. గతంలో మాలలను ఒకే వేదికపైకి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశామని, తీసుకురాలేకపోయామని.. కానీ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మాలలంతా ఒక్కటయ్యారని కొనియాడారు. సొంత ఖర్చులతో మాలలంతా తరలి వచ్చి సభను విజయవంతం చేశారని తెలిపారు.