కేసీఆర్​కు వేల కోట్లు ఎక్కడివి?..ఉద్యమం టైమ్​లో పైసా లేకుండే: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దండుకున్నడు
  • ప్రజాధనం వృథా చేసిండు
  • చెన్నూర్​ను మోడల్ సెగ్మెంట్​గా తీర్చిదిద్దుతా
  • 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి
  • చెన్నూర్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోల్​బెల్ట్/కోటపల్లి/చెన్నూరు, వెలుగు :  కాళేశ్వరం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల కమీషన్ దోచుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆరోపించారు. రూ.70వేల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని.. రూ.7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖాళీ చేశారని ఫైర్ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ను విస్మరించి.. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో రూ.1.25 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్​లోని చెన్నూరు, కోటపల్లి మండలాల్లో ఎమ్మెల్యే వివేక్ మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

కోటపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమ టైమ్​లో ఒక్క పైసా లేని కేసీఆర్​కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయ్? ప్రజలేమో డబ్బులు కూడబెట్టుకుని ఉద్యమం చేశారు. కమీషన్ల కింద వేల కోట్లు వెనకేసుకున్న కేసీఆర్.. మహారాష్ట్రలో భూములు కొన్నట్లు ఇటీవల కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ లీడర్ ఒకరు చెప్పారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ హయాంలో పంటలు పండని భూములకూ రూ.10 వేలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాక రూ.15వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు’’అని వివేక్ తెలిపారు.

విద్య, వైద్య రంగాన్ని డెవలప్ చేస్తం

చెన్నూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. ‘‘చెన్నూర్ నియోజకవర్గాన్ని మోడల్ సెగ్మెంట్​గా తీర్చిదిద్దుతా. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ సప్లై పనులు జరుగుతున్నయ్. మున్సిపాల్టీ ప్రజల సౌకర్యార్థం హెల్త్ సెంటర్లు నిర్మిస్తున్నం. సోమనపల్లి గ్రామంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి దాకా రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం పని చేసినం. ఈ ఏడాది విద్య, వైద్య రంగాన్ని డెవలప్ చేస్తం. అన్ని స్కూల్స్ లో ఆర్వో ప్లాంట్ల కోసం నిధులు మంజూరు చేశాం.

మా అన్న వినోద్ తో కలిసి మల్లంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినం’’అని వివేక్ అన్నారు. కోటపల్లి మండల పరిధిలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండటంతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, నీటి సరఫరా పనులు చేపట్టేందుకు అటవీ శాఖ అనుమతులు రాక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. పర్మిషన్ల కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కేంద్ర మంత్రితో మాట్లాడారని వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీ మేరకు నక్కలపల్లి లోతు ఒర్రెపై లో లెవల్ వంతెన ప్రారంభించుకున్నట్లు వివేక్ తెలిపారు. ‘‘నేను ఎప్పుడూ కలెక్టర్​తో మాట్లాడుతూనే ఉంటాను. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉంటాను. నక్కలపల్లి గ్రామానికి నేను ఏడు సార్లు వచ్చిన. త్వరలోనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఆర్వోబీ బ్రిడ్జిని శాంక్షన్ చేయిస్తే.. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు.

చెన్నూర్ సెగ్మెంట్​కు ఆర్ అండ్ బీ శాఖ నుంచి రోడ్ల నిర్మాణానికి రూ.60 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. నా మీద సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నరు. ఎన్ని ఆరోపణలు చేసినా నేను పట్టించుకోను’’అని వివేక్ అన్నారు.