భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలో గురువారం రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ చోట మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోగా మరో చోట విఫలయత్నం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జుల్ఫేకర్ గల్లీలో రాణి అనే మహిళ బీడీ కంపెనీకి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కునేందుకు యత్నించారు. గొలుసు తెగిపోకుండా సదరు మహిళ గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు.
ఆ తర్వాత ఆ దుండగులే కమల థియేటర్ సమీపంలో మరో స్నాచింగ్‌కు పాల్పడ్డారు. గోకుల్ నగర్లో అద్దెకుంటున్న రజిత అనే యువతి థియేటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దొంగలు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెల గొలుసు, మరో తులం బంగారు చైన్‌ను లాగగా తెగిపోయాయి. అప్పటికే గట్టిగా పట్టుకున్న రజితకు సగం, మరో తులం బంగారం స్నాచర్ల చేతికి చిక్కడంతో వాటితో పరారయ్యారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు చోట్ల స్నాచింగ్ ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు.
బాధితురాలు రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి స్నాచర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ నెలలో భైంసాలో ఇది రెండో స్నాచింగ్ ఘటన. ఈ నెల 3న రాహుల్‌నగర్‌లో లక్ష్మి అనే మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసును దుండగులు తెంపుకొని ఉడాయించారు. దీంతో స్థానిక మహిళలు ఇండ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.