సబ్​కో నిరాశ్.. ఏ వర్గాన్నీ పెద్దగా ఆకట్టుకోని కేంద్ర బడ్జెట్​

  • పేరుకే భారీపద్దు.. మిత్రపక్షాలకే పెద్దపీట
  • ఏపీ, బిహార్​ రాష్ట్రాలకు వరాల జల్లు
  • వ్యవసాయం, రక్షణ, రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్​తోనే సరి
  • మహిళా శిశు సంక్షేమానికి నిరుడితో పోలిస్తే 2.5 శాతమే పెంపు
  • హెల్త్​కు రూ. 91 వేల కోట్లు.. ఎడ్యుకేషన్ అండ్​ స్కిల్స్​కు 1.48 లక్షల కోట్లు
  • యూత్​కు ‘పీఎం ప్యాకేజీ’ కింద జాబ్స్​భూ సంస్కరణలను స్పీడప్​ చేసే 
  • రాష్ట్రాలకు 50 ఏండ్ల కాలపరిమితితో వడ్డీలేని రుణాలు

మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సర్కార్​ తీసుకొచ్చిన ఫుల్​ బడ్జెట్​ ఏ వర్గాన్నీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.  రూ. 48.20 లక్షల కోట్ల ఈ భారీ పద్దు ఇటు మిడిల్​క్లాస్​ను కానీ..  అటు రైతులను, ఉద్యోగులను కానీ అంతగా సంతృప్తి పర్చలేకపోయింది. వ్యవసాయం, రక్షణ, రైల్వే  వంటి కీలక రంగాలకు కూడా పార్లమెంట్​ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే మోదీ సర్కార్​ సరిపెట్టింది. 

మంగళవారం ఉదయం లోక్​సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2024–-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బిహార్​, ఆంధ్రప్రదేశ్​కు ఇందులో ప్రయారిటీ దక్కింది. పదేండ్లలో నిరుద్యోగంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ పేరుతో మూడు స్కీమ్​లను ప్రకటించింది. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నట్లు తెలిపింది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లోని సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పోలిస్తే  7.8 శాతం సబ్సిడీల్లో కోతపెట్టింది. ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్​ అని అధికారపక్షం చెప్తుండగా.. ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్​లా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ఇది జనం బడ్జెట్.. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం: మోదీ

పల్లెలు, పేదలు, రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. 
- ప్రధాని నరేంద్ర మోదీ

కుర్చీ బచావో బడ్జెట్.. బీజేపీ మిత్రపక్షాలు,మిత్రులకే మేలు: రాహుల్  

ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను బుజ్జగించడం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టారు. మిత్రపక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను బుజ్జగించడం కోసం సామాన్య ప్రజలకు మొండిచేయి చూపించారు. కేవలం ఏఏ (అదానీ, అంబానీ)కు ప్రయోజనాలు చేకూర్చుతూ.. సామాన్య జనానికి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్​లా ఉంది. గత బడ్జెట్​లను కాపీ పేస్ట్ చేశారు.
- రాహుల్​ గాంధీ