సెబీ నిబంధనలే కారణమా..4 ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల అమ్మకం..కేంద్రం ప్రపోజల్స్

  • సెబీ నిబంధనలే కారణం
  • త్వరలో కేబినెట్​ ముందుకు ఫైల్​
  • ఓఎఫ్​ఎస్​ద్వారా వాటాల అమ్మకం

న్యూఢిల్లీ: మనదేశ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను అమ్మాలనే ప్రపోజల్​ను కేంద్రం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు రాయిటర్స్‌‌ వార్తాసంస్థకు తెలిపాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌‌లలో వాటాను తగ్గించుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రానున్న నెలల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. 

బీఎస్​ఈ డేటా ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి  కేంద్రానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌‌లో 96.4 శాతం, యుకో బ్యాంక్‌‌లో 95.4 శాతం  పంజాబ్  సింధ్ బ్యాంక్‌‌లో 98.3 శాతం వాటాలు ఉన్నాయి. ఓపెన్‌‌ మార్కెట్‌‌లో ఆఫర్‌‌ ఫర్‌‌ సేల్‌‌ ద్వారా వాటాను విక్రయించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రిపోర్టు తర్వాత బ్యాంకుల షేర్లు 3 శాతం నుంచి 4 శాతం మధ్య పెరిగాయి. 

గడువు పొడగింపు ?

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) లిస్టెడ్ కంపెనీలు 25 శాతం పబ్లిక్ షేర్‌‌హోల్డింగ్‌‌ను కొనసాగించాలని కోరుతోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ఆగస్టు 2026 వరకు ఈ నిబంధనలను పాటించకుండా మినహాయించింది. కేంద్రం రెగ్యులేటర్ ఆదేశాల మేరకు వాటాలు అమ్ముతుందా ?  తదుపరి పొడిగింపును కోరుతుందా ? అనే విషయంలో స్పష్టత రాలేదు. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అమ్మకం తేదీ, సైజును నిర్ణయిస్తారని సంబంధిత అధికారి ఒకరు అధికారి తెలిపారు. ఈ విషయమై వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. గతంలో, ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధనాన్ని సమీకరించడానికి క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ ప్లేస్‌‌మెంట్‌‌లను (క్విప్​) ప్రారంభించాయి. ఈ విధానం ద్వారానే ప్రభుత్వ రంగ బ్యాంకులలో కేంద్రం తన వాటాను తగ్గించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్‌‌లో క్యూఐపీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించగా, అక్టోబర్‌‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.3,500 కోట్లు సేకరించింది.