- 18,472 డొల్ల కంపెనీలను గుర్తించిన అధికారులు
- మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలలో ఎక్కువ..
- రికవర్ చేయడం ఈజీ కాదంటున్న ట్యాక్స్ డిపార్ట్‌మెంట్
న్యూఢిల్లీ : దేశం మొత్తం మీద రూ.26,543 కోట్ల విలువైన జీఎస్‌టీ ఎగవేతలను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాలను గుర్తించేందుకు జీఎస్‌టీ ఎగ్గొట్టారని అనుమానిస్తున్న అకౌంట్లపై దర్యాప్తు జరిపింది. ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు సుమారు 68,903 సంస్థలను గుర్తించామని, ఇందులో 18,472 సంస్థలు మనుగడలోనే లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులు పేర్కొన్నారు. జీఎస్‌టీ ఎగ్గొట్టారని అనుమానించిన ట్యాక్స్ పేయర్లలో డొల్ల కంపెనీల వాటా 27 శాతంగా ఉంది.
‘ఫేక్ ఐటీసీలను గుర్తించేందుకు జరిపిన సెకెండ్ నేషనల్‌వైడ్ డ్రైవ్‌లో రూ.26,543 కోట్ల జీఎస్‌టీ ఎగవేతలను గుర్తించాం. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలలో జీఎస్‌టీ ఎగవేత కేసులు ఎక్కువగా ఉన్నాయి’ అని సీబీఐసీ అధికారులు తెలిపారు. ట్యాక్స్ ఎగవేతలను గుర్తించినప్పటికీ, రికవరీ మాత్రం అంత సులభం కాదని వివరించారు. ‘మోసాన్ని గుర్తించకముందే ఐటీసీ అందుకున్న కేసులు చాలా ఉన్నాయని తెలుసుకున్నాం.
దీంతో ట్యాక్స్ రికవర్ చేయడంలో ఇబ్బందులు నెలకొన్నాయి. డొల్ల కంపెనీలు ఒక్కో ఫ్రాడ్‌లో కనీసం రూ.1.5 కోట్లను మోసం చేశాయి’ అని పేర్కొన్నారు. తాజా నేషనల్ డ్రైవ్‌లో కనుగొన్న వివరాలను జీఎస్‌టీ కౌన్సిల్ ముందు ఈ నెల 21 న సీబీఐసీ ప్రవేశపెట్టనుంది. ఫేక్ ఐటీసీలను అరికట్టేందుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. కాగా, కొన్ని ప్రొడక్ట్‌లపై ఒకసారి కంటే ఎక్కువసార్లు జీఎస్‌టీ కట్టే ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయొచ్చు.
పెండింగ్ కేసులపై కొనసాగుతున్న దర్యాప్తు..
ట్యాక్స్ ఎగ్గొట్టారని అనుమానిస్తున్న 74,070 సంస్థలను మొదటి డ్రైవ్‌లో సీబీఐసీ గుర్తించింది. ఇందులో 5 వేల సంస్థలను వెరిఫై చేయాల్సి ఉంది. వీరిలో మెజార్టీ ట్యాక్స్ పేయర్లు ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన 765 పెండింగ్ అకౌంట్లు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఢిల్లీలో 3,300 కేసులను గుర్తించారు. వీటిపై దర్యాప్తు జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా మహారాష్ట్రలో గుర్తించిన అకౌంట్స్‌ను ఇంకా వెరిఫై చేయలేదని ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు.
కాగా, ట్యాక్స్ ఎగ్గొట్టారని అనుమానిస్తున్న అకౌంట్లను జీఎస్‌టీ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్), లోకల్ అధికారుల సాయంతో సీబీఐసీ కనిపెట్టింది. ఫేక్ ఐటీసీలను అరికట్టేందుకు ఈ ఏడాది మే 14 నుంచి జులై 14 వరకు మొదటి నేషనల్‌వైడ్ డ్రైవ్‌ను అధికారులు చేపట్టారు. అప్పుడు 77,200 కంపెనీలను వెరిఫై చేయగా, ఇందులో 20,800 డొల్ల కంపెనీలను గుర్తించారు.