అదానీ కేసు గురించి .. మాకు సమాచారం లేదు : కేంద్రం

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై నమోదైన కేసు గురించి అమెరికా నుంచి భారత్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి సమాచారమూ అందలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి,  ఇతరులకు సమన్లు ​వచ్చాయన్న రిపోర్ట్​లను తోసిపుచ్చింది.  ‘‘ఇది ప్రైవేట్ సంస్థలకు,  వ్యక్తులకు...  యూఎస్​ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌తో ముడిపడి ఉన్న చట్టపరమైన విషయం. ఇటువంటి వాటిని పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. వాటి ప్రకారమే అంతా జరుగుతుంది. 

ఈ అంశం గురించి అక్కడి ప్రభుత్వంతోనూ మేం మాట్లాడలేదు’’ అని ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో శుక్రవారం విలేకరులతో అన్నారు. సమన్లు ​​లేదా అరెస్ట్ వారెంట్ల కోసం విదేశీ ప్రభుత్వం నుంచి అభ్యర్థన వస్తే మెరిట్స్​ ఆధారంగా నిర్ణయం ఉంటుందని వివరణ ఇచ్చారు. యుఎస్ నుంచి ఈ కేసుపై ఎటువంటి అభ్యర్థనా రాలేదని స్పష్టం చేశారు. 

ఈ కేసు వ్యక్తి,  ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన విషయమని, భారత ప్రభుత్వం ఏ విధంగానూ దానిలో భాగం కాదని జైస్వాల్ వివరించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ  సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్​ జైన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది.