చెన్నూర్ ఎమ్మెల్యే పీఏపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసు..పరారీలో నిందితుడు: ఏసీపీ

జైపూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పీఏ రమణారావుపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎలుకంటి గ్రామానికి చెందిన బేతు తిరుపతి రెడ్డి రెండు రోజుల క్రితం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పీఏ రమణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పలు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో రమణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు మేరకు బేతు తిరుపతి రెడ్డిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తూ గ్రూపుల్లో షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్లు, వైరల్ చేసిన వారికి పరువు నష్టం కింద కేసు నమోదవుతుందని హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై శ్రీధర్ ఉన్నారు.