న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) 18 వేల మంది ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) ద్వారా తొలగించాలని నిర్ణయించింది. వీరందరికీ పరిహారం చెల్లించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్టెలికం (డాట్) కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. ఉద్యోగుల తొలగింపు వల్ల కంపెనీ ఏడాది జీతాల బిల్లు రూ.7,500 కోట్ల నుంచి రూ.ఐదు వేల కోట్లకు తగ్గుతుంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి 35 శాతం మంది ఉద్యోగులను తీసేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.
బ్యాలెన్స్షీట్ను బలోపేతం చేసుకోవాలని కంపెనీ కోరుకుంటోందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వీఆర్ఎస్ ప్రతిపాదనకు బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం రాగానే కేబినెట్అప్రూవల్ కోరుతుంది. వీఆర్ఎస్పై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయని, తుది నిర్ణయం తీసుకోలేదని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.21,302 కోట్ల రెవెన్యూ సంపాదించింది. సంస్థలో ప్రస్తుతం 55 వేల మంది పనిచేస్తున్నారు.