- ఎక్స్ట్రాలు చేస్తే అధికారంలోకి వచ్చాక మిత్తితో చెల్లిస్తం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
- అధికారులు ఎక్కువ తక్కువచేస్తే పేర్లు రాసిపెట్టుకుంటం
- మేం పదేండ్లు అధికారంలో ఉన్నాకిరాతకపు పనులు చేయలే
- కాంగ్రెసోళ్లను ప్రజలుఉరికించి కొట్టే రోజులు వచ్చినయ్
- కాంగ్రెసోళ్ల కంటే పెద్ద మోసగాళ్లు బీజేపోళ్లు అని కామెంట్
ఆదిలాబాద్, వెలుగు: పోలీసులు, అధికారులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సై కావొచ్చు.. ఎస్పీ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ఎవడైనా సరే అంటూ విరుచుకుపడ్డారు. ఎవడైనా సరే ఎక్స్ట్రాలు చేస్తే పేర్లు రాసి పెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ లో గురువారం బీఆర్ఎస్ చేపట్టిన రైతు పోరు సభలో కేటీఆర్ మాట్లాడారు. పోలీసులైనా, అధికారులైనా న్యాయం ప్రకారం వెళ్లాలని, ఎక్కువ తక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలకు చెప్పారు.
పోలీసులకు, అధికారులకు ఒకటే చెప్తున్న. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. మేం పదేండ్లున్నం. ఎప్పుడు ఇలాంటి కిరాతక పనులు చేయలే.. ఎవడో పైనుంచి మంత్రో, కంత్రో ఫోన్ చేయంగనే పోలీసులు ఆగంకావొద్దు. న్యాయం ప్రకారం వెళ్లాలి. పోలీసులైనా, ప్రభుత్వ అధికారులైన ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే మా బీఆర్ఎస్ నేతలు పేర్లు రాసి పెట్టాలి. వాడు ఎస్సై కావొచ్చు, సీఐ కావొచ్చు, ఎస్పీ కావొచ్చు, కలెక్టర్ కావొచ్చు ఎవడైనా సరే పక్కాగా మిత్తితో సహా చెల్లించే బాధ్యత మాదే’ అని కేటీఆర్ కామెంట్లు చేశారు.
కాంగ్రెస్ పాలన అస్తవ్యస్థంగా మారిందని, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. ‘‘పది నెలల్లోనే రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. పోలీసుల భార్య, పిల్లలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరు. ప్రజల కోసం నేను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. ప్రజలు మర్లపడి కాంగ్రెసోళ్లను ఊర్లలో ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్. కాంగ్రెసోళ్ల కంటే పెద్ద మోసగాళ్లు బీజేపోళ్లు” అని ఆయన విమర్శించారు.
ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే
నిర్మల్, వెలుగు: రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్మల్ లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ అన్నారు. రైతుల సలహాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, వారి పంట పొలాలకు నష్టం జరిగేలా ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి ఇంట్లో గురువారం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా
రైతులు జరిపే ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామని ఆయన ప్రకటించారు.