కరీంనగర్, వెలుగు: త్వరలో జరగబోయే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపే పరిస్థితి కనిపించట్లేదు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడిన బీఆర్ఎస్ పోటీ చేద్దామా..? మద్దతు ఇద్దామా? అనేది నిర్ణయించుకోలేక పోతోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి వరంగల్, -నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశలోకి జారుకుంది. ఇలా వరుస ఓటముల తర్వాత మరోసారి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రాగా పోటీ చేసి ఓడిపోతే మరింతగా దిగజారిపోతామనే భయం ఆ పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతున్నట్టు తెలిసింది.
అగ్రనేతల ఇలాఖాలోనూ ఓటమి
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లో గతంలో వరుసగా బీఆర్‌ఎస్ క్యాండిడేట్ గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితతోపాటు మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి బలమైన నేతలు సెగ్మెంట్ పరిధిలో ప్రాతినిథ్యం వహిస్తుండగా ఓటమితో ఖంగుతున్నారు. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పరాజయంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ ఆశావహుల్లో కన్ఫ్యూజన్
కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ఆశిస్తున్న అభ్యర్థులు గత మూడు నెలలుగా ఓటర్ల నమోదు, ప్రచారంలో నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించే నేతలు మాత్రం పార్టీ ఎటూ తేల్చకపోవడంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఆశావహులైన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, తెలంగాణ రికగ్నైజ్ డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(ట్రస్మా) నేత వై.శేఖర్‌రావు అడపాదడపా ప్రచారం నిర్వహిస్తున్నారు. తామూ పోటీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాం యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ నుంచి వీరికి ఎలాంటి సిగ్నల్ రాలేదు. దీంతో ప్రచారంలో ముందుకెళ్లాలా..? వద్దా..? అనేది తేల్చుకోలేకపోతున్నారు.
బయటి నుంచే మద్దతిచ్చే యోచన
వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వమంతా రంగంలోకి దిగి పని చేసినా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా నమ్మకుండా కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. అందుకే పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఎన్నికల్లో మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు బయటి నుంచి మద్దతిచ్చినట్లుగానే ఈసారి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.
స్థానికంలోనూ ఓడిపోతామనే భయం
రాష్ట్రంలో ఏడాది నుంచి ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్కు అపజయాలే ఎదురవుతున్నాయి. తొలి నుంచి తమకు అండగా ఉంటున్న జిల్లాల్లో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ మళ్లీ ఉత్తేజితం అవుతుందని కొందరు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు. అంతో ఇంతో బలముందని చెప్పుకునే ఉత్తర తెలంగాణలోనే మరోసారి దెబ్బ పడితే రాబోయే పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే ఆలోచనలో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు తెలిసింది.