కేసీఆర్​ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు

  • కనీసం ఇంటింటికి తాగునీరు ఇయ్యలే: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • సీఎం రేవంత్​రెడ్డి చొరవతో సమస్యలు పరిష్కరిస్తున్నమని వెల్లడి
  • చెన్నూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభం

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు: పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో దోపిడీ తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. చెన్నూరులో  రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందన్నారు.  కనీసం ఇంటింటికి తాగునీటిని కూడా ఇవ్వలేకపోయారన్నారు.  చెన్నూరు నియోజకవర్గం  అభివృద్ధిలో పదేండ్లు  వెనుకకు పోయిందన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని చాకలివాడ, మారేమ్మవాడ, ఎంపీవాడ, పుప్పాల హనుమాన్ వాడ, గోదావరి రోడ్, జెండావాడ, బేతాళవాడ తదితర వార్డుల్లో ఎమ్మెల్యే మార్నింగ్​ వాక్​ చేశారు. 

స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని.. వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే, పుప్పాల హనుమాన్​కాలనీలో, మున్సిపల్​ఆఫీస్​ఎదుట సుమారు రూ.2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోదావరి రోడ్, కుమ్మరిబొగుడాలో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్​ రెడ్డి చొరవతో చెన్నూరు​లో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. చెన్నూరులో మిషన్​ భగీరథ నీళ్లు రావడంలేదని, పైపులైన్లు వేసినా సప్లయ్ ​లేదంటూ ప్రజలు మార్నింగ్​వాక్​లో ఫిర్యాదు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అన్ని ఏరియాలకు తాగునీరు అందేలా  ప్రణాళికలు రెడీ చేస్తున్నామన్నారు. 

అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నూరు మాజీ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సద్దనపు కృష్ణమూర్తి, స్వర్ణకారుడు ఉప్పులపు బ్రహ్మయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట చెన్నూరు కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్ చెన్న ఈ, పీఎస్​సీఎస్​ చైర్మన్​ చల్ల రాంరెడ్డి, నియోజకవర్గ లీడర్లు హిమంత్​రెడ్డి, అంకాగౌడ్​, పాతర్ల నాగరాజు ఉన్నారు.