ఖాకీల్లో అవినీతి జలగలు

  • మెదక్​ జిల్లాలో వరుసగా ఏసీబీకి చిక్కుతున్న పోలీస్ అధికారులు
  •  సివిల్ వ్యవహారాల్లో జోక్యం
  • స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, వెహికల్ రిలీజ్ కు లంచం డిమాండ్

మెదక్, వెలుగు : ఏసీబీకి పట్టుబడుతున్నా.. కేసులు నమోదై జైలుకు వెళుతున్నా కొంతమంది పోలీసుల తీరు మారడం లేదు. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం, సెటిల్​మెంట్స్​చేయడం, పైసలివ్వనిదే పని చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కొంతమంది పోలీస్​అధికారులు ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీనివల్ల నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎఫెక్ట్​ పడుతోంది. జిల్లాలోని మనోహరాబాద్​, తూప్రాన్​, శివ్వంపేట, నర్సాపూర్​ మండలాల్లో అక్రమ మట్టి తవ్వకాలు, మెదక్​టౌన్, మెదక్​రూరల్, పాపన్నపేట, కొల్చారం, చిలప్​చెడ్​తదితర మండలాల్లో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చాలామంది స్థానిక పోలీసులపై నమ్మకం లేకే టాస్క్​ఫోర్స్​పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. శివ్వంపేట మండలంలో చెరువుల్లో నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఇరిగేషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆయాచోట్ల అక్రమంగా ఇసుక, మట్టి తవ్వుతూ పట్టుబడిన వెహికల్స్​ను రిలీజ్​ చేసేందుకు ఆయా పీఎస్​ల ఎస్ఐలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్​ చేస్తున్నారు. మెదక్​రూరల్, హవేలి ఘనపూర్ ఎస్ఐలు ఈ వ్యవహరంలోనే ఏసీబీకి పట్టుబడ్డారు.

కొందరు పోలీస్​ అధికారులు లంచాల కోసం కానిస్టేబుళ్లను​ఏర్పాటు చేసుకుంటుండగా, మరికొందరు ప్రైవేట్​వ్యక్తులను నియమించుకుంటున్నారు. హవేలి ఘనపూర్​ఎస్ఐ ఓ రిపోర్టర్​ను డబ్బుల వసూలుకు మధ్య వర్తిగా ఏర్పాటు చేసుకొన్న విషయం ఏసీబీ దాడిలో బయటపడింది.  ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కిందిస్థాయి పోలీస్​ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మార్చి నెలలో మెదక్​ రూరల్ పీఎస్​లో రైటర్ సురేందర్​లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని అవుసులపల్లికి చెందిన కందుల రాము అలియాస్ చంద్రం ఇసుక వెహికిల్​ను సీజ్​ చేయగా తిరిగి అప్పగించేందుకు రూ.4 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారు  రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారున్ని బెయిల్​పై విడుదల చేయడానికి కూడా రూ.15 వేలు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ కేసులో మెదక్ రూరల్ ఎస్ఐ అమర్​, కానిస్టేబుల్​బాసిత్ ల పాత్ర ఉన్నట్టు తేలడంతో వారినీ సస్పెండ్​ చేశారు. తాజాగా ఇసుక టిప్పర్​ రిలీజ్​ చేసేందుకు మధ్య వర్తిద్వారా రూ.20 వేలు లంచం తీసుకుంటూ హవేలి ఘనపూర్​ఎస్ఐ కర్రె ఆనంద్​ గౌడ్​ఎసీబీకి పట్టుబడ్డాడు.

కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సిద్దిపేట జిల్లా భూంపల్లి ఎస్ఐ రవికాంత్​ రావును మే నెల 30వ తేదీన ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. అతడు శివ్వంపేట ఎస్ఐగా పనిచేసిన సమయంలో ఓ మామిడి తోటలో 50 టన్నులకు పైగా మామిడి పండ్లు చోరీకి గురయ్యాయి. దీంతో తోట యజమాని విమలారెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసు నమోదు చేయకపోగా, ఈ కేసు సివిల్​ పరిధిలోకి వస్తుందంటూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు.

ఈ విషయంలో ఎస్పీ ఎంక్వైరీ చేయించి ఉన్నతాధికారులకు రిపోర్ట్​ పంపారు. ఈ మేరకు ఎస్ఐ రవికాంత్​ రావుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని సస్పెండ్​ చేశారు. కోర్టు ధిక్కారం కేసులో ఇదివరకు తూప్రాన్​ డీఎస్పీగా పనిచేసిన యాదిగిరి రెడ్డి, శివ్వంపేట ఎస్ఐగా పనిచేసిన రవికాంత్​ రావు​లకు హైకోర్టు జరిమానా విధించింది. శివ్వంపేట మండలం సికింద్లాపూర్​లో ఓ భూమి డెవలప్​మెంట్​ విషయంలో వివాదం నెలకొంది.

ఈ వ్యవహారంలో బాధితులు పోలీసులను ఆశ్రయించగా తూప్రాన్​ డీఎస్పీ, శివ్వంపేట ఎస్ఐలు అక్రమార్కులకు అండగా నిలిచి బాధితులను బయపెట్టారు. ఈ విషయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని జూన్​ 5న తూప్రాన్​ డీఎస్పీ , శివ్వంపేట ఎస్ఐలకు కోర్టు రూ.2 వేల చొప్పు జరిమానా విధించింది.