చినుకు జాడేది..?.. దోబూచులాడుతున్న మబ్బులు

  • పత్తి, మొక్కజొన్న  రైతుల్లో ఆందోళన
  • వరినాట్లు మరింత ఆలస్యం
  • జిల్లాలో నమోదు కాని సగటు వర్షపాతం

సిద్దిపేట, వెలుగు: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఆశతో ముందుగా విత్తినా విత్తనాలు మొలకెత్తక పోవడంతో నష్టం తప్పదేమోనని బయపడుతున్నారు. 

సీజన్​ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా సిద్దిపేట జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మరోవైపు జిల్లాలో ప్రస్తుత సీజన్ లో 5.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించి అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సిద్దం చేశారు.

ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే..

వానా కాలం ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ సీజన్ లో విస్తారంగా వర్షాలుంటాయని మందుస్తు అంచనాలున్నా పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జూన్ లో 104.0 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉన్నా 22వ తేదీ వరకు కేవలం 69.3 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. జిల్లాలోని  మొత్తం 26 మండలాల్లో ఐదు మండలాల్లో సాధారణం కంటే తక్కువ, 11మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బోరు బావులపై ఆధారపడ్డ రైతులు వరి నారుమళ్లను సిద్దం చేసుకున్నా వర్షాల పరిస్థితిచూసి నాట్లు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. 

పత్తి మొక్కజొన్న రైతుల్లో ఆందోళన

వర్షాలు పడతాయనే ఆశతో వరి, మొక్కజొన్న రైతులు ముందస్తుగానే దుక్కులు దున్ని విత్తనాలు వేశారు. కానీ వర్షాలు కురియకపోవడంతో ప్రస్తుతం వారందరూ ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్, గజ్వేల్ డివిజన్లలోని రైతులు ఇలాంటి పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పత్తి మొక్కలను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. 

మరికొందరు రైతులు మొక్కజొన్న పంటకు స్ర్పింకర్లను అమర్చుకుని కాపాడుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో  దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి , మొక్కజొన్న పంటలు వేయగా చాలా వరకు గింజలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. దీంతో మరొసారి విత్తుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో తీవ్ర నష్టం తప్పదనే భయం రైతుల్లో మొదలైంది. మరోవైపు వరుణుడి కరుణ కోసం గ్రామాల్లో ప్రజలు, రైతులు ప్రార్థనలు ప్రారంభిచారు. సీజన్ మొదట్లోనే వరుణుడు కరుణించక పోవడంతో గ్రామాల్లో కప్పతల్లి ఆటలు, మహిళలు బతుకమ్మ ఆటలు ప్రారంభించారు. తమ ప్రార్థనలతోనైనా వరుణుడు కరుణిస్తే పంటలు పండించుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. 

రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు 

జూన్​లో ఆశించిన మేర వర్షాలు పడనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు. భూమిలో తడి లేకపోతే విత్తనాలు మొలకెత్తడం కష్టం. ఇంకా సీజన్​ ముగియలేదు కాబట్టి రైతులు మరికొన్ని రోజులు వర్షాల కోసం వేచిచూడడం ఉత్తమం. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న రైతులు భూమి తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తాలి. ఇప్పటి వరకు 60 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న గింజలు విత్తారు. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భూమి తడిగా లేనప్పుడు విత్తనాలు వేయొద్దని గ్రామాల్లో ప్రచారం చేయడంతో పాటు రైతు నేస్తం కార్యక్రమాల్లో రైతులకు అవగామన కల్పిస్తున్నాం.- మహేశ్, ఇన్​చార్జి డీఏవో, సిద్దిపేట

ఈ ఫొటోలో ఉన్నది దానబోయిన శ్రీనివాస్. మండల కేంద్రమైన కోహెడకు చెందిన  రైతు. ప్రతీ వానకాలం సీజన్ లో తనకున్న ఎకరం భూమితో పాటు మరో తొమ్మిదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తుంటాడు. ఈసారి సైతం పత్తి సాగు చేయడానికి ఇరవై వేలు ఖర్చు చేసి విత్తనాలు కొనుగోలు చేశాడు.  వర్షాలు సకాలంలో కురుస్తాయనే ఆశతో ఐదెకరాల్లో పత్తి విత్తనాలు విత్తినా చినుకు జాడ కనిపించక పోవడంతో మిగిలిన భూమిలో విత్తకుండా ఆపాడు. వారం రోజులుగా వర్షం కురవక పోవడంతో విత్తిన పత్తిగింజలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇది ఒక  రైతు శ్రీనివాస్ పరిస్థితికాదు సిద్దిపేట జిల్లాలో చాలామంది మంది రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది.