- శనివారం గల్లంతైన ముగ్గురు యువకులు
- మరొకరి కోసం గజ ఈతగాళ్ల గాలింపు
కాగజ్‌నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని ప్రాణహిత నదిలో శనివారం గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి డెడ్‌బాడీలు ఆదివారం దొరికాయి. నదిలో గల్లంతైన చోటుకు సమీపంలోని తలాయి వద్ద ఆదివారం ఉదయం జహీర్ హుస్సేన్ (24) డెడ్‌బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై విక్రమ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.
మిగిలిన ఇద్దరి కోసం నదిలో గాలిస్తుండగా సాయంత్రం ఇర్షద్ (20) మృతదేహం దొరికింది. మూడో వ్యక్తి మొహిసిద్ (22) ఆచూకీ దొరకకపోవడం, అప్పటికే చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. ఘటనాస్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం పరిశీలించారు. ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన బాధాకరం అని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు.
ఆదివారం వేర్వేరుగా ఘటనాస్థలాన్ని పరిశీలించి, గాలింపు చర్యలను పర్యవేక్షించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్సీ దండే విఠల్ హామీ ఇచ్చారు.