బెల్లంపల్లిలో జోరుగా రక్తదాన శిబిరాలు

ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి, వెలుగు: నాడు పోలీసుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కారణమని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ​ఆలం అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్​ హెడ్​క్వార్టర్స్​తో పాటు జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల రక్తదానం శిబిరాలు నిర్వహించారు. శిబిరాలను ఎస్పీ ప్రారంభించారు. 

ఎస్పీతోపాటు ఆయన సోదరుడు డాక్టర్ జిలాని రక్తదానం చేశారు. మొత్తం 250 మంది పోలీసులు బ్లడ్ డొనేట్​ చేసినట్లు చెప్పారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. డీఎంహెచ్​వో కృష్ణ, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, బి.సురేందర్ రెడ్డి, పట్టణ సీఐలు, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు, డాక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సనాతన సాఫ్ట్​వేర్ కంపెనీ ఆధ్వర్యంలో..

రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ మంచిర్యాల సభ్యుడు అభినవ సంతోష్ అన్నారు. సనాతన సాఫ్ట్​వేర్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి పట్టణం కాల్​టెక్స్​లోని ఆఫీస్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. 40 మంది యువకులు రక్తదానం చేసినట్లు సనాతన సీఎస్ఆర్ హెడ్ కీర్తన తెలిపారు. సంస్థ డైరెక్టర్ సాయినాథరాజు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.