- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : “గుంటకాడి నక్కలా కేసీఆర్ ఉన్నడు. పసికూన లాంటి ఐదునెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలి.. ఎలా ఇబ్బంది పెట్టాలని తప్ప ఆయనకు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని లేదు. అసెంబ్లీకి వెళ్దాం.. చర్చల్లో పాల్గొందామని లేదు. ఎంతసేపూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతా అంటున్నాడు. 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అంటున్నాడు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మామూలుగా ఉండదు”అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు.
శనివారం సాయంత్రం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాంగ్రెస్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. “తమది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వం కూలి పోతుంది అంటున్నారు. కేసీఆర్, మోదీ కలిసి కుట్ర చేస్తున్నారు.
బండి సంజయ్ ఏమో మీ దగ్గర షిండేలు ఉన్నారు అంటున్నాడు. ఎందరు షిండేలు వచ్చినా ఏంచేయలేరు. ఈ ప్రభుత్వానికి ఏమైనా అయితే ప్రజలు ఊరుకుంటారా..” అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.