- ఆలస్యమైనా ఓపికగా వేచిఉన్న జనం
- అమిత్ షా ప్రసంగానికి విశేష స్పందన
సిద్దిపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ విశాల జన సభ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే సిద్దిపేటలో బీజేపీ సభకు జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా జనం తరలిరావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఊహించిన దానికంటే అధికంగా జనం రావడం పట్ల బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా రాక ఆలస్యమైనా జనం ఓపికగా ఎదురుచూశారు. ఆయన ప్రసంగం కేవలం 8 నిమిషాలే సాగినా సభ ఈలలు, కేకలతో హోరెత్తింది. ప్రజలు, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన అమిత్షా మరింత జోరుగా ప్రసంగించడమే కాకుండా పలుమార్లు మోదీకు అనుకూలంగా నినాదాలు చేయించారు. రఘునందన్ రావును అధిక మెజార్టీతో గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా కొంతమంది సభలో సహారా ఇండియా పేమెంట్స్ చెల్లించాలి, ఖాతాదారులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇవేమీ పట్టించుకోకుండా అమిత్షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. వేదిక పై ఉన్న నేతలు, కార్యకర్తలు వారి దగ్గరకు చేరుకుని వారిని సముదాయించి కూర్చోబెట్టారు. అమిత్షా పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. కలేక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగి 10 కిలోమీటర్ల దూరంలోని సభాస్థలికి కారులో చేరుకున్నారు. సభలోకి వచ్చే వారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలను సభా వేదిక ముందుకు అనుమతించలేదు.