25 ఏళ్ల తర్వాత కమల వికాసం

మెదక్, వెలుగు:  రెండున్నర దశాబ్దాల తర్వాత మెదక్ లోక్​ సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది.  2004 నుంచి 2019 వరకు ఐదు సార్లు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు ఎన్నికల్లో టీఆర్ఎస్  పార్టీ అభ్యర్థులే మెదక్ ఎంపీ లుగా గెలుపొందారు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ  రెండు, మూడు స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయా ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ ఆ పార్టీకి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1952లో మెదక్​ లోక్​ ‌సభ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 

1999  లోక్‌‌సభ ఎన్నికల వరకు నేషనల్​ పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. 2004 నుంచి జరుగుతున్న పార్లమెంట్​ఎన్నికల్లో  బీజేపీకి ఓటమి ఎదురవుతోంది. 1999లో మెదక్​ లోక్​సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచిన ఆలె నరేంద్ర 2004లో టీఆర్ఎస్‌ ‌అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ఐదు సార్లు లోక్‌‌సభ ఎన్నికలు జరగ్గా వరుసగా అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌‌ఎస్‌‌అభ్యర్థులే విజయం సాధించారు. 

2014 ఎన్నికలప్పటి నుంచి బీజేపీ క్యాండిడేట్లను మార్చుతున్నా ఫలితం ఉండడం లేదు. ఆ ఎన్నికల్లో  బీజేపీ కొత్త అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌‌కు టికెట్‌‌ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన థర్డ్‌‌ప్లేస్‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీఎం పదవి చేపట్టేందుకు కేసీఆర్‌ ‌ఎంపీ పదవికి రాజీనామా చేయగా 2014 సెప్టెంబర్‌‌లో మెదక్‌ ‌లోక్‌‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అంతకు ముందు జనరల్‌‌ఎలక్షన్‌‌లో పోటీచేసి ఓడిపోయిన క్యాండిడేట్​కు అవకాశం ఇవ్వకుండా సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేసి ఓడిపోయిన తూర్పు జయప్రకాశ్‌‌రెడ్డికి ఎంపీ టికెట్‌‌ఇచ్చింది. అయితే జనరల్ ఎలక్షన్‌ ‌మాదిరిగానే ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. 

2019 లోక్‌‌సభ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ సిట్టింగ్‌‌ఎంపీ కొత్త ప్రభాకర్‌‌రెడ్డికే మళ్లీ టికెట్‌‌ఇవ్వగా,  బీజేపీ మళ్లీ క్యాండిడేట్‌ను మార్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌కోసం  నలుగురు లీడర్లు ప్రయత్నాలు చేయగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పదవికి పోటీచేసి ఓడిపోయిన రఘునందన్‌‌రావుకు టికెట్‌‌కేటాయించింది. అయితే 2014 జనరల్ ఎలక్షన్స్​, ఉప ఎన్నికల  మాదిరిగానే 2019 ఎలక్షన్‌లో సైతం ‌ఓటర్లు జాతీయ పార్టీలను ఆదరించ కుండా టీఆర్​ఎస్​ అభ్యర్థిని గెలిపించారు. ఇలా వరుసగా ఐదు లోక్​ సభ ఎన్నికల్లో  బీజేపీ ఓటమి చవిచూడగా, వరుసగా మూడు లోక్‌‌సభ ఎన్నికల్లో  క్యాండిడేట్లను మార్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ప్రస్తుత లోక్​ సభ ఎన్నికల్లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని  బీజేపీ భావించింది.  

ఈ ఎన్నికల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన రఘునందన్​ రావు​కే మళ్లీ టికెట్​ ఇచ్చింది.  కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కంటే ముందుగా లోక్​సభ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడం, వివిధ వర్గాల ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడంలో అదే స్పీడ్​ కొనసాగించింది,  గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్​ సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క చోట కూడా గెలుపొందకపోగా, ఒక్క గజ్వేల్​ సెగ్మెంట్​ మినహా మిగతా ఆరు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. 

కాగా లోక్​సభ ఎన్నికల్లో ఓటర్ల వైఖరి వేరుగా ఉంటుందని, తమకు అనుకూల వాతావరణం ఉంటుందని బీజేపీ భావించింది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం వంటివి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణమవుతున్నాయని ఆ పార్టీ విశ్వసించింది. ఈ మేరకు లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగి పాతికేళ్ల తర్వాత మెదక్​ లోక్​ సభ స్థానంలో కాషాయ జెండా ఎగరవేసింది.