నస్పూర్/కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల నుంచి కార్మికులకు 33 శాతం వాటా చెల్లించాలని, అంకెల గారడీతో కార్మికులకు ఆర్థికంగా నష్టం చేయడం సరికాదని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణికి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నికర లాభాలు తక్కువగా చూపించి, కార్మికులకు తక్కువ లాభాల వాటా చెల్లించిందని, సింగరేణిని అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్ అయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిందన్నారు. నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నవేని సదానందం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నాయకులు మహేందర్ వర్మ, బీజేపీ నేతలు మొగిలి, బింగి ప్రవీణ్, నస్పూర్ పట్టణ ఉపాధ్యక్షుడు సామ్రాజ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ లీడర్ల ధర్నా
సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి అందులో నుంచి కార్మికులకు 33శాతం వాటా ప్రకటించా లని టీబీజీకేఎస్ లీడర్లు డిమాండ్ చేశారు. మందమర్రి జీఎం ఆఫీస్ వద్ద ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ఎస్వోటు జీఎం రాజేశ్వర్ రెడ్డికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ లాభాలు
రూ.4701కోట్ల నుంచి కార్మికుల వాటా రూ.1551కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక టీబీజీకేఎస్ లీడర్లు పాల్గొన్నారు.