నా సెగ్మెంట్​లో డబ్బులు పంచుతున్నరు : రఘునందన్ రావు

  •     బీఆర్ఎస్​కు కాంగ్రెస్ సహకరిస్తున్నది: రఘునందన్ రావు
  •     రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్

మెదక్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు కనుసన్నల్లోనే డబ్బుల పంపిణీ జరుగుతున్నదని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో సెగ్మెంట్​లో జరుగుతున్న డబ్బుల పంపిణీపై ఆదివారం ఆయన మెదక్ కలెక్టరేట్​లో రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శనివారం సాయంత్రం నుంచి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్​చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 చొప్పున పంచుతున్నరు. 

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా డబ్బులు పంచుతున్నరు. హరీశ్​కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెల్ప్ చేస్తున్నడు. బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నడు. మాజీ సర్పంచ్​లు, బీఆర్ఎస్ లీడర్లను పిలిపించుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నడు. ఈ విషయం ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, సీపీలకు చెప్పినా పట్టించుకోవడం లేదు’’అని అన్నారు. 

15 కార్లు ఎవరివో ఎంక్వైరీ చేయాలి

శనివారం రాత్రి చేగుంట మండలం పెద్దశివనూర్, చిన్న శివనూర్ ఫామ్​హౌస్​లోకి బీఆర్ఎస్ లీడర్లు 15 కార్లలో వచ్చారని, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా వెంటనే స్పందించలేదని రఘునందన్ అన్నారు. తాము కంప్లైంట్ చేసిన రెండు గంటల తర్వాత పోలీసులు వెళ్లడంపై అనుమానాలున్నాయని చెప్పారు. ‘‘ఒక కారు ఆపి చెక్ చేస్తే రూ.88లక్షలు దొరికాయని పోలీసులు చెప్తున్నరు. అక్కడ దొరికిన కవర్లలో ఏ బూత్​కు.. ఎన్ని డబ్బులు పంచాలన్నది స్పష్టంగా రాసి ఉన్నది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడకు వచ్చిన 15 కార్లు ఎవరివో ఎంక్వైరీ చేయాలి. 

ఈ విషయమై రిటర్నింగ్ ఆఫీసర్లకు, జనరల్ అబ్జర్వర్​కు, ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తాం. మెదక్ ఎంపీగా నేను గెలుస్తున్నా అని తెలిసే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దొంగా.. పోలీస్ ఆట ఆడుతున్నాయి’’అని అన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఎన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్​తో కుమ్మక్కైనా బీజేపీని ఓడించలేరని చెప్పారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​కు తీసుకెళ్లేదాకా బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.