హాట్రిక్​ దక్కేనా?.. మూడోసారి గెలవడానికి బీఆర్ఎస్​ పార్టీ, బీజేపీ అభ్యర్థి కసరత్తు

  • పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
  • జహీరాబాద్ ​రిజల్ట్​పైనే అందరి ఫోకస్​

సంగారెడ్డి, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో బీజేపీ, బీఆర్ఎస్ హాట్రిక్​ విజయం కోసం ఆరాటపడుతున్నాయి. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పరిధిలో  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో విస్తరించి ఉన్న ఈ లోక్ సభ సెగ్మెంట్2009లో ఏర్పడింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరుగగా 2009లో కాంగ్రెస్ ఆ తర్వాత 2014, 2019లో బీఆర్ఎస్ గెలిచాయి. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ తరఫున పోటీచేసి గెలుపొందిన సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీబీ పాటిల్ పార్టీ మారడంతో ఈసారి బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.  జహీరాబాద్ లో పార్టీకి హ్యాట్రిక్ విజయం అందిస్తానని ఆయన నమ్మకంతో ఉన్నారు. అయితే మూడోసారి కూడా తానే గెలుస్తానని సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ నమ్మకంగా ఉన్నారు. పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం ఒకరు.. ఎంపీగా మూడోసారి గెలవడానికి మరొకరు ప్రచారం కొనసాగిస్తున్నారు. 

అగ్రనేతల ప్రచారాలు

జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పుల్కల్ మండలం సుల్తాన్​పూర్​లో గత నెలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో గాలి అనిల్ కుమార్ ను గెలిపించి పార్లమెంట్​కు పంపాలని తద్వారా బీఆర్ఎస్ కు హాట్రిక్​ విజయం అందించాలని కోరారు. అల్లాదుర్గం వద్ద ఇటీవల నిర్వహించిన విశాల జనసభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ను గెలిపించి మూడోసారి పార్లమెంట్​కు పంపాలని కోరారు. ఇలా అగ్రనేతల సభల్లో కూడా హాట్రిక్ అంశం ప్రస్తావనకు రావడం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. 

ఓటర్లు ఎటువైపు..? 

హాట్రిక్ విజయాల కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్, బీజేపీలకు జహీరాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఆ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రచారంలో కూడా బీఆర్ఎస్, బీజేపీలకు ఏమాత్రం తీసిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ స్కీముల సక్సెస్ పై ప్రజలకు వివరిస్తూ రెండోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విలక్షణమైన నియోజకవర్గంగా పేరొందిన జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడ లింగాయత్, మున్నూరు కాపు, మైనార్టీ, గిరిజన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్​లో కాంగ్రెస్ బలంగా ఉండడంతో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై ఓటర్లు ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్లు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు హ్యాట్రిక్ విజయం అందిస్తారా లేక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రెండోసారి ఎంపీగా పార్లమెంట్ కు పంపిస్తారా అనేది అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది.